హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
శుక్రవారం అనూహ్యమైన అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఇటువంటి
అనుభవాన్ని ఎదుర్కుని ఉండరు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం చివరి
నిమిషంలో ఒక్కసారిగా వేడెక్కింది. పదేళ్లుగా పార్టీని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ వ్యాఖ్యానించినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు
వచ్చాయి. దీంతో చంద్రబాబు ఆగ్రహం
కట్టలు తెంచుకున్నట్లు చెబుతున్నారు.
బాలసాని
లక్ష్మినారాయణ వ్యాఖ్యలకు చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నాయకులపై ఆయన రివర్స్లో
విమర్శలు సంధించినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేశారని చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ తనను
అలవాటైందని, తనను విమర్శించడం అందరికీ
ఫ్యాషన్గా మారిందని చంద్రబాబు
విరుచుకపడ్డారని సమాచారం. పనిలో పనిగా ఆయన
నాయకులకు క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. బాలసానిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు.
రానున్న
ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి శుక్రవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
సమావేశం ప్రారంభం అతి సాధారణంగానే జరిగింది.
కానీ చివరలోనే వేడెక్కింది. నిజానికి, చంద్రబాబుపై వేలెత్తి చూపే ధైర్యం పార్టీ
సీనియర్ నాయకులు కూడా ఎప్పుడూ చేసినట్లు
లేదు. అలా చంద్రబాబుకు వ్యతిరేకంగా
పనిచేసేవారు పార్టీ నుంచి వెళ్లిపోయే విధంగా
వ్యూహరచన చేయడం చంద్రబాబుకు అలవాటేనని
ప్రత్యర్థులు అంటారు.
తన వైఖరిని, విధానాలను వ్యతిరేకించేవారిని ఆయన సహించరు. వారికి
వ్యతిరేకంగా పార్టీలోనే మరికొందరిని తయారు చేస్తారు. అందుకే
పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబును తప్పు
పట్టే పని చేయడం కనిపించదు.
కానీ బాలసాని వ్యవహారం చంద్రబాబు అంచనాకు కూడా అందలేదు. బాలసాని
వ్యవహారం పార్టీ సీనియర్ నాయకులను కూడా షాక్కు
గురిచేసేదే. కాగా, చంద్రబాబు నాయుడు
ఈ నెల 9వ తేదీన
తిరుపతి నుంచి తన ఉప
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 18వ
తేదీన ఆయన వరంగల్ జిల్లా
పరకాలలో పర్యటిస్తారు.
0 comments:
Post a Comment