న్యూఢిల్లీ:
రాష్ట్రంలో బాత్ రూంలు ఉన్న
వారి కంటే సెల్ఫోన్లు ఉన్న వారి
సంఖ్యే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. గ్యాస్ సరఫరా కోసం గెయిల్తో ఒప్పందం కుదుర్చుకోవడం
హర్షణీయమని కిరణ్ కుమార్ రెడ్డి
అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ లభ్యమైతేనే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. ఇటీవలి
కాలంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయిందని చెప్పారు.
విద్యుత్
ఉత్పత్తికి అయ్యే ఖర్చు బాగా
పెరిగిందని, ఒక మెగావాట్ విద్యుదుత్పత్తికి
నాలుగు నుండి ఐదు కోట్ల
రూపాయల ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్రంలో
విద్యుత్, గ్యాస్ కొరత ఉందన్నారు. రాష్ట్ర
విద్యుత్ సంస్థలకు గ్యాస్ సరఫరా అంశంపై న్యూఢిల్లీలో
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం ఉదయం ఏఐసిసి ప్రధాన
కార్యదర్శి జనార్ధన్ ద్వివేదితో భేటీ అయ్యారు. అంతకుముందు
మోతీలాల్ వోరాతో భేటీ అయ్యారు. అయితే
తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని, కిరణ్ ఢిల్లీ వచ్చిన
సందర్భంగా తమను మర్యాదపూర్వకంగా కలిశారని
మోతీలాల్ వోరా మీడియా సమావేశంలో
చెప్పారు.
కాగా
సోమవారం జాతీయ అంతర్గత భద్రతా
సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లు తగ్గారని,
కేవలం ఎనిమిది జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని ముఖ్యమంత్రి చెప్పారు. న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్లో సోమవారం
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన అంతర్గత
భద్రతపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ఛత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర
సరిహద్దుల్లోనే నక్సలైట్లు ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఏఓబీలో
రక్షణ దళాలను తరలించేందుకు, ఏజెన్సీ ప్రాంతాల్లో గాయపడిన పోలీసులను తరలించడానికి వైజాక్ కేంద్రంగా ఓ హెలికాఫ్టర్ను
ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
నక్సలైట్ల అణచివేతకు రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు. యువత
ఉపాధి కోసం రాజీవ్ యువ
కిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం
నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్డు నిర్మాణానికి
రూ.2400 కోట్లు కేటాయించాలని కిరణ్ కేంద్రాన్ని కోరినట్లు
తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో
మావోయిస్టుల కార్యకలాపాలు చురుగ్గా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించిందని చెబుతూ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలకు సహకారం అందించాలని కిరణ్ కోరారు. తీవ్రవాద
నిరోధక చర్యల ఖర్చును ఎన్ఆర్ఈ
నిధుల కిందకు తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఆ సదస్సుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గైర్హాజరు కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి
జయలలిత కేంద్ర వైఖరిపై ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాల స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఎన్సిటిసి వల్ల
సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుదని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్రానికి
వ్యతిరేకంగా ఆమె కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను
కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment