న్యూఢిల్లీ:
ఉప ఎన్నికలు జరిగే 18 శాసనసభా నియోజకవర్గాల్లో నాలుగు సీట్లకు కాంగ్రెసు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు.
ఈ సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై
కాంగ్రెసు పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. అనంతపురం, పోలవరం, పరకాల, రాయచోటి సీట్లకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదని
తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి అధిష్టానం
ఆమోద ముద్ర వేయించుకోవడానికి ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో
బిజీగా గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ సోమవారం
ఉదయం కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో సమావేశమయ్యారు. బొత్స
సత్యనారాయణ కేంద్ర మంత్రి వాయలార్ రవితో సమావేశమయ్యారు. 18 స్థానాల్లో
14 స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
పోలవరం సీటు మహిళకు కేటాయించాలని
ఆ జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు సూచిస్తున్నట్లు సమాచారం.
దీనిపై పార్టీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా,
రాయచోటి, అనంతపురం స్థానాల్లో ఒక్కదాన్ని ముస్లింలకు, ఒక్కదాన్ని బలిజ సామాజిక వర్గాన్ని
కేటాయించాలని రాష్ట్ర నాయకుల నుంచి సూచన వస్తోంది.
దీంతో రాయచోటికి ముఖ్యమంత్రి ఖరారు చేసిన అభ్యర్థిని
పక్కన పెట్టేసి అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాయచోటి సీటుకు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కేటాయించాలని సూచించారు. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
పరకాల సీటుకు కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి
భార్య జ్యోతికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, వరంగల్ జిల్లా నాయకులు కొంత మంది వ్యతిరేకిస్తున్నట్లు
తెలుస్తోంది.
ఇదిలా
వుంటే, తిరుపతి సీటు టికెట్ మంత్రి
గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్కు
దక్కలేదు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి
ప్రయత్నించినప్పటికీ జయదేవ్కు సీటు రాలేదు.
తిరుపతికి వెంకటరమణ, శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట నియోజకవర్గానికి ధర్మాన రాందాసు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా
గాంధీని కలుస్తారని తెలుస్తోంది.
0 comments:
Post a Comment