హైదరాబాద్:
2014 ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా
భావిస్తున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి
జరగనున్న ఉప ఎన్నికలపై అధికార
కాంగ్రెసు పార్టీలో అయోమయం కనిపిస్తోందని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని గందరగోళ పరిస్థితి వారిలో ఉందని అంటున్నారు. రాష్ట్రపతి
ఎన్నిక లోపే ఉప ఎన్నికల
ప్రక్రియ పూర్తవుతుందని పార్టీలోని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ప్రస్తుతం వేసవి తీవ్రత అధికంగా
ఉన్నందున ఆగస్టులో ఉప ఎన్నికలు జరుగుతాయని
చెబుతున్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆగస్టులోనే ఎన్నికలు
జరుగుతాయన్న నమ్మకంతో ఉన్నారట. కొందరు సన్నిహితుల వద్ద సిఎం ఇదే
అభిప్రాయాన్ని వెల్లడించారట. కాగా, ఎఐసిసి దూత
వయలార్ రవి సమక్షంలో శుక్రవారం
జరిగిన అనంతపురం జిల్లాకు చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో
ఉప ఎన్నికలు కాస్త ఆలస్యమైతే మంచిదని
ఎంపి అనంత వెంకటరామి రెడ్డి
అభిప్రాయపడ్డారు.
ఆ సందర్భంగా సిఎం బదులిస్తూ ఉప
ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం
లేదని చెప్పారట. అయితే కేంద్ర ఎన్నికల
సంఘం అధికారులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికలోపే దేశ వ్యాప్తంగా ఉన్న
శాననసభా, లోక్సభా స్థానాల
ఖాళీలన్నింటికీ ఎన్నికలు నిర్వహిస్తామని సంకేతాలు పంపుతోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈ బుధవారం
లోగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం
ఉందన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో
కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. మిగిలిన రాజకీయపక్షాలు తమ తమ అభ్యర్థులను
ఖరారు చేసుకుని ప్రచారంలోకి వెళ్లి పోగా కాంగ్రెస్ మాత్రం
అభ్యర్థులను ప్రకటించడంలో ఇంకా మీన మేషాలు
లెక్కిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి రెండు
మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.
కానీ,
అధికారపక్షం మాత్రం కొన్నింటికి తప్ప మెజారిటీ స్థానాలకు
అభ్యర్థులెవరో అనధికారికంగా కూడా ప్రకటించే స్థితిలో
లేదు. నరసన్న పేట నుంచి మంత్రి
ధర్మాన ప్రసాద రావు సోదరుడు ధర్మాన
రాందాసును రంగంలోకి దింపుతున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట
అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు
కాలేదు. రామచంద్రాపురం నుంచి తోట నరసింహం,
నరసాపురం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడుల
పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
ఇక పోలవరం నుంచి బొజ్జి దొరను
రంగంలోకి దించాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. ఒంగోలు నుంచి
ఎవరిని రంగంలోకి దింపాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు
ఈ నియోజకవర్గం నుంచి మంత్రి శ్రీనివాస
రావు లేదా మాగుంట పార్వతమ్మను
రంగంలోకి దంపాలన్న యోచనలో ఉన్నా తుది నిర్ణయానికి
రాలేకపోతున్నారు. ఉదయగిరి నుంచి మాదాల జానకీ
రామ్ పేరు బలంగా వినపడుతున్నా
కంభం విజయరామిరెడ్డి, చంచలబాబు యాదవ్, వెంటేశ్వరచౌదరిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
తిరుపతి
అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గల్లా జయదేవ్,
వెంకట రమణలు పోటీ పడుతున్నారు.
వీరిలో వెంకట రమణ అభ్యర్థిత్వం
పట్ల ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి
మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజంపేట
నుంచి మేడా మల్లిఖార్జున రెడ్డి,
రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డి,
రైల్వే కోడూరు నుంచి ఈశ్వరయ్యల పేర్లు
ఖరారయ్యాయని అంటున్నారు.
అనంతపురం
(అర్బన్) నుంచి ఎంపి అనంత
వెంకట్రామి రెడ్డి సోదరుడు సుబ్బారెడ్డిని రంగంలోకి దింపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కానీ, వెంకట్రామిరెడ్డి మాత్రం
తన సోదరుడిని రంగంలోకి దింపేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. శనివారం
నాడు లేక్వ్యూ అతిథి
గృహంలో గతంలో పిఆర్పీ తరఫున
రంగంలోకి దిగిన టిజె ప్రకాశ్తో వెంకట్రామిరెడ్డి మంతనాలు
జరిపారు.
ప్రకాశ్
అభ్యర్థిత్వం వైపే వెంకట్రామిరెడ్డి మొగ్గు
చూపుతున్నారు. రాయదుర్గం నుంచి పాటిల్ వేణుగోపాల
రెడ్డి, ఆళ్లగడ్డ నుంచి గంగుల ప్రతాపరెడ్డి,
ఎమ్మిగనూరు నుంచి రుద్రగౌడ్ల
పేర్లు దాదాపు ఖరారయ్యాయని అంటున్నారు. అయితే అభ్యర్థుల పేర్లు
అనధికారికంగా ప్రకటించేందుకు కూడా కాంగ్రెస్ సన్నద్ధం
కాకపోవడం పట్ల అధికారపక్షంలో ఆందోళన
కనిపిస్తోంది.
0 comments:
Post a Comment