న్యూఢిల్లీ:
తమ పార్టీకి చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యులపై చర్యలు తీసుకునే దిశగా కాంగ్రెసు అధిష్టానం
ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండో విడత బడ్జెట్
సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో కలిసి అధికార కాంగ్రెసు
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మంగళవారం లోకసభ కార్యకలాపాలను అడ్డుకున్నారు.
జై తెలంగాణ నినాదాలు చేశారు.
పార్లమెంటు
సమావేశాలకు అడ్డు తగలవద్దని కాంగ్రెసు
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్
పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు సూచించారు. అయినా వారు ఆయన
మాట వినకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
తెలంగాణపై తక్షణమే చర్చించాలని కోరుతూ తెలుగుదేశం లోకసభ సభ్యులు వాయిదా
తీర్మానం ఇచ్చారు. తమ నోటీసును అనుమతించాలని
కోరుతూ తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఆందోళనకు దిగారు. వారితో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కలిసి తెలంగాణ నినాదాలు
చేశారు.
స్పీకర్
వెల్లోకి వెళ్లి వారంతా
నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో
కాంగ్రెసు అధిష్టానం తీవ్ర చిక్కుల్లో పడింది.
దీంతో కాంగ్రెసు కోర్ కమిటీ అత్యవసరంగా
సమావేశమై ఏం చేయాలనే విషయంపై
ఆలోచన చేసింది. తెలంగాణ పార్లమెంటు సభ్యులతో ఓసారి మాట్లాడాలని అధిష్టానం
గులాం నబీ ఆజాద్కు
సూచించింది. వినకపోతే సభ నుంచి వారిని
సస్పెండ్ చేయాలనే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు
చెబుతున్నారు.
కాగా,
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కె. చంద్రశేఖర రావు,
విజయశాంతి మంగళవారం సభకు రాలేదు. తాము
ఆందోళన చేస్తున్నప్పుడు యుపిఎ చైర్ పర్సన్
సోనియా గాంధీ సభలోనే ఉన్నారని,
అయినా ఒక్క మాట కూడా
మాట్లాడలేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు
అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు మోసం చేస్తోందని, సమస్యకు
కూడా కాంగ్రెసు పార్టీ కారణమని ఆయన మీడియా ప్రతినిధులతో
అన్నారు. కెసిఆర్కు తెలంగాణ సమస్య
పట్టదని ఆయన విమర్శించారు. తెలంగాణ
సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసుపై ఉందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment