హైదరాబాద్:
అవినీతి విషయంలో అందరు రాజకీయ నాయకులను
ఒకే గాటాన కట్టడం వెనుక
సిపిఎంకు రహస్య ఎజెండా ఏమైనా
ఉందేమోనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
నారాయణ శనివారం సిపిఎంను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి,
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందరూ అవినీతిపరులే అని
సిపిఎం చెప్పడం వెనుక ఏదో ఉందని
అనుమానం వ్యక్తం చేశారు.
సాధారణంగా
బూర్జువా పార్టీలు రాజకీయాల్లో అవినీతికి పాల్పడుతుంటాయని ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నింటికీ అవినీతి
మరకలంటడం సహజమేనన్నారు. వాటి అవినీతి విషయంలో
వామపక్షాలు విమర్శనాత్మక దృక్పథంతోనే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, దివంగత వైయస్ అధికారాన్ని అడ్డు
పెట్టుకొని ఆయన తనయుడు, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
భారీ అవినీతికి పాల్పడి సంపాదించారని ఆరోపించారు.
ఇప్పుడు
ఆ సంపదను చట్టబద్ధం చేసుకునేందుకు రాజకీయ పార్టీ పెట్టాడని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి
శవం వద్దనే సంతకాలు సేకరించిన ఘనుడు జగన్ అన్నారు.
అలాంటి జగన్తో ఇతర
పార్టీల నేతలను పోల్చడం మాత్రం తగదని సిపిఎంకు సూచించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నది అవినీతి నుంచి పుట్టిందనే విషయంలో
సిపిఐ స్పష్టమైన అభిప్రాయంతో ఉందన్నారు.
కానీ,
పార్టీలన్నీ అవినీతి పార్టీలేనంటూ అందరినీ ఒకే గాటిన కట్టేయడం
మాత్రం తగదని పేర్కొన్నారు. తాము
తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయాలని
నిర్ణయించుకున్నామన్నారు.
వైయస్ తన హయాంలో జరిగిన
అవినీతి మకిలిని కాంగ్రెసుకు అంటగట్టి అక్రమ సంపాదన మాత్రం
కుమారుడికి కట్టబెట్టారన్నారు. రానున్న ఉప ఎన్నికలలో అధికార,
ప్రతిపక్షాల మధ్య పోటీ ఆంబోతుల
పోట్లాటలా ఉంటుందని, డబ్బు విచ్చలవిడిగా వెదజల్లుతున్నారని
విమర్శించారు.
కాంగ్రెసు,
జగన్ పార్టీ ఒకే తానులోని ముక్కలన్నారు.
సిపిఐ, సిపిఎంలు కలిసి పోటి చేసి
ఎంత కష్టపడినా రాజకీయ ప్రచారం చేయలేమని, కాంగ్రెసు, జగన్ పార్టీలను ఎదుర్కోలేమని
చెప్పారు. అందుకే టిడిపితో కలిసి వెళుతున్నట్లు చెప్పారు.
తెలంగాణలో తెరాసకు, సీమాంధ్రలో టిడిపికి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment