న్యూఢిల్లీ:
గోదావరి నదిపై తలపెట్టిన ప్రాణహిత
- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య శనివారం ఒప్పందం
కుదిరింది. కేంద్ర జల సంఘం అధ్యక్షుడు
ఝా, జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ధృవ్
విజయ్ సింగ్ల సమక్షంలో
ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల
ముఖ్య కార్యదర్శులు తొలుత ఒప్పందంపై సంతకాలు
చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
సంతకాలు చేసి పత్రాలను పరస్పరం
మార్చుకున్నారు.
ప్రాణహిత
- చేవెళ్ల ప్రాజెక్టు వల్ల ఇరు రాష్ట్రాలు
ప్రయోజనం పొందుతాయని పృథ్వీరాజ్ చౌహన్ అన్నారు. ఇది
తెలంగాణ ప్రాంతానికి జీవనది అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి
అన్నారు. సంతకాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమయంలో మీడియాకు
ఆయన క్లాస్ తీసుకున్నారు. ఈ రోజు రాజకీయాల
గురించి మాట్లాడదలుచుకోలేదని, చారిత్రకమైన సంఘటన గురించి వెల్లడించడానికి
మాత్రమే మీడియా సమావేశం పెట్టామని ఆయన చెప్పారు. ప్రతికూల
ఆలోచనలు మానుకోవాలని ఆయన మీడియాకు సూచించారు.
ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందం చేసుకునేది అయితే తెలంగాణ ఉప
ఎన్నికలకు ముందే చేసుకునేవాళ్లమని, ఇప్పుడు
తెలంగాణలో ఉప ఎన్నికలు ఒక్క
చోట తప్ప లేవని ఆయన
అన్నారు. ఉప ఎన్నికలకు, అభివృద్ధికి
ముడిపెట్టవద్దని ఆయన అన్నారు. రాజకీయాలు
మరో సమయంలో మాట్లాడుదామని ఆయన అన్నారు. తెలంగాణ
రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన
ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
ప్రాణహిత
- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 38,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని
ఆయన చెప్పారు. హైదరాబాద్ మంచినీటికి 30 టిఎంసిలు, గ్రామాల మంచినీటికి 10 టిఎంసిలు, 16 టిఎంసిల నీరు పరిశ్రమలకు కేటాయించనున్నట్లు
ఆయన తెలిపారు. తెలంగాణలోని సాగునీటికి 120 టిఎంసిలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ
మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తెచ్చినట్లు
ఆయన తెలిపారు.
ప్రాణహిత
- చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తిపోతలకు 3,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని ఆయన చెప్పారు. దానికి
అవసరమయ్యే విద్యుత్తును ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసే ఏర్పాట్లు ఉంటాయని
ఆయన చెప్పారు. తెలంగాణలో ఇదే పెద్ద ప్రాజెక్టు
అని ఆయన చెప్పారు. పోలవరం
ప్రాజెక్టుకు ఒడిషా, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి
సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. దివంగత
నేత రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ఒప్పందం వల్ల ప్రాణహిత - చేవెళ్ల
ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించడం
సులభం అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి
చెప్పారు.
0 comments:
Post a Comment