నెల్లూరు/హైదరాబాద్: రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు,
ఓ మంత్రి అరెస్టు కావడం ఇదే ప్రథమమని
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అన్నారు. ఆయన మంగళవారం శ్రీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలలో పెట్టుబడులు
పెట్టించారని ఆరోపించారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఆత్మ బంధువు కెవిపి రామచంద్ర రావును ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. అక్రమాలలో
కెవిపి పాత్ర ఎంతో ఉందన్నారు.
అవినీతిపరుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి
భారతీయ జనతా పార్టీ మద్దతు
పలకడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులను ఉప ఎన్నికలలో ఓడించాలని
ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
సిబిఐ
ఓ స్వతంత్ర సంస్థ అని వైయస్
రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడు నిండు
సభలో చెప్పారని నామా నాగేశ్వర రావు
హైదరాబాదు మీడియా సమావేశంలో అన్నారు. మాజీ మంత్రి పరిటాల
రవీంద్ర హత్య కేసులో వైయస్సే
తన కొడుకు జగన్ పైన సిబిఐ
విచారణకు ఆదేశించారన్నారు. జగన్ బినామీ ఆస్తుల
వివరాలపై లోతైన విచారణ జరగాలని
ఆయన సూచించారు. ఇప్పటి వరకు జరిగిన సిబిఐ
విచారణలో కేవలం పదిహేను శాతం
మాత్రమే బయటపడిందన్నారు.
ప్రజాధనం
దోచుకున్న వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబానికి ఓట్లు అడిగే నైతిక
హక్కు లేదన్నారు. అవినీతిపరులు, నేరగాళ్లు పార్టీ అధ్యక్షులు అయితే రాష్ట్రాన్ని రక్షించే
వారెవరన్నారు. ప్రజాధనాన్ని పూర్తిగా జగన్ లూటీ చేశారన్నారు.
ఏ వ్యాపారం చేసి జగన్ అన్ని
కోట్లు సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి హయాంలో అక్రమాలు, బెదిరింపులకు పాల్పడి సంపాదించారని నామా నాగేశ్వర రావు
ఆరోపించారు.
న్యాయమూర్తులపై
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు సరికాదని మరో నేత రావుల
చంద్రశేఖర రెడ్డి అన్నారు. న్యాయమూర్తులకు దురుద్దేసాలు ఆపాదించడం చట్ట ఉల్లంఘన కిందకే
వస్తుందన్నారు. జగన్ పార్టీ నేతలు
నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారన్నారు. వారు రాజ్యాంగ వ్యతిరేక
వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జివోల జారీలో మంత్రుల
పాత్రపై విచారించాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా పని చేయాల్సి ఉందన్నారు.
0 comments:
Post a Comment