ప్రముఖ
హీరో రాజశేఖర్ తిరిగి కాంగ్రెసులోకి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఏ క్షణంలోనైనా
తిరిగి కాంగ్రెసులో చేరే అవకాశముందని అంటున్నారు.
రాజశేఖర్ - జీవిత దంపతులు కాంగ్రెసు
నుండి బయటకు వెళ్లడానికి కారణం
రాజ్యసభ చిరంజీవియే. అయితే ఇప్పుడు వారి
చేరికకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వారిని తిరిగి కాంగ్రెసులోకి తీసుకు వచ్చేందుకు రాజ్యసభ సభ్యుడు ఒకరు చిరంజీవి - రాజశేఖర్ల మధ్య రాయబారం
నెరిపారని అంటున్నారు.
అటు తెలుగు సినిమా పరిశ్రమతోనూ, ఇటు రాజకీయాలతోనూ మంచి
సంబంధాలు ఉన్న సుబ్బి రామి
రెడ్డియే ఈ రాయబారం నెరిపి
ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇరువురి మధ్య రాయబారం నడిపిన
ఆయన రాజశేఖర్, జీవితల రీ ఎంట్రీకి చిరంజీవిని
కూడా ఒప్పించారని అంటున్నారు. అయితే ప్రస్తుతం వారు
కాంగ్రెసులోకి తిరిగి చేరడం కాకుండా, త్వరలో
విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో
కాంగ్రెసునే గెలిపించాలని పిలుపునివ్వనున్నారని తెలుస్తోంది.
తద్వారా
తాము కాంగ్రెసును వీడలేదనే అభిప్రాయాన్ని కలిగించాలని చూస్తున్నారని అంటున్నారు. కాగా రాజశేఖర్, జీవితలు
వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెసు
కార్యకలాపాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తన
బద్దశత్రువు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెసులో కలిపేయడంతో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసుకు పూర్తిగా దూరమయ్యారు. కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొంతకాలం ఉన్నారు.
అయితే
అక్కడ వారు ఎక్కువ కాలం
కొనసాగలేక పోయారు. ఆ తర్వాత తెలుగుదేశం
పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అక్కడా వారికి
ఎదురు దెబ్బే తగిలింది. ఆ తర్వాత వారు
జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు
చూశారు. వారు బిజెపిలో పార్టీ
అగ్రనేత వెంకయ్య నాయుడు సమక్షంలోనే చేరుతామని పట్టుబట్టారు. దీంతో అది అప్పటికి
వాయిదా పడింది.
ఏమైందో
ఏమో కానీ వారి బిజెపి
రంగ ప్రవేశం మళ్లీ వెనక్కి పోయింది.
తాజాగా వారు తిరిగి కాంగ్రెసులోకే
వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న రాజశేఖర్ దంపతులు
చిరంజీవితో రాజీకి వచ్చారని, అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్
ఇచ్చారని అంటున్నారు. రీఎంట్రీపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణను అడిగితే ఆయన చిరంజీవి అభిప్రాయానికే
వదిలేశారట. ఆ తర్వాత రాజ్యసభ
సభ్యుడు ఎంటర్ అయి రాయబారం
నెరపి సక్సెస్ చేశారని అంటున్నారు.
0 comments:
Post a Comment