శ్రీకాకుళం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఆదివారం విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కిరణ్ ఉప ఎన్నికల
ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా
రోజుల తర్వాత కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు
అధినేతపై విమర్శలు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని
ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
తాను చనిపోయేంత వరకు కాంగ్రెసు కోసం
పాటుపడతానని చెప్పారన్నారు.
కానీ
ఆయన కడుపున పుట్టిన జగన్ మాత్రం అదే
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆ కుట్ర ఫలితమే
ప్రస్తుత ఉప ఎన్నికలు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావుతో జగన్ నాడు కుమ్మక్కై
అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచారన్నారు. వైయస్ వల్ల కాంగ్రెస్కు ఎలాంటి నష్టం
వాటిల్లలేదన్నారు.
పార్టీకి
వైయస్ చేసిన సేవలకు గుర్తింపుగానే
ఆయనకు రెండుసార్లు పిసిసి అధ్యక్ష పదవి, రెండుసార్లు ప్రధాన
ప్రతిపక్ష నాయకుడి హోదా, రెండు పర్యాయాలు
సిఎం పదవి దక్కాయని అన్నారు.
ఇలా పార్టీ తనకు చేసిన న్యాయానికి
ప్రతిఫలంగా వైయస్ కూడా చివరి
వరకు కాంగ్రెస్ శ్రేయస్సు కోసం పరితపించారు. తాను
చనిపోయే మూడు రోజుల ముందు
వరకూ పార్టీ గురించే ఆయన మాతో చర్చించారన్నారు.
2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 42 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అందరి లక్ష్యం కావాలని
వైయస్ తమకు పదే పదే
చెప్పేవారని సిఎం తెలిపారు.
వైయస్
అంటే తమందరికీ ఎంతో గౌరవం, ప్రాణమని
చెప్పారు. ఆయనకు తాను, మంత్రి
ధర్మాన, ఎంపి ఉండవల్లి అరుణ్
కుమార్, మరో మంత్రి రఘువీరా
రెడ్డి రక్షణ కవచంగా నిలిచేవారమని
చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేసిన
వైయస్, అదే పార్టీని దెబ్బతీయడానికి
విపక్షాలతో కలసి కుట్రలు పన్నిన
జగన్మోహన్రెడ్డికి మధ్య ఉన్న తేడాను
ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక ఎంపి స్థానానికి
జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని
తాను నరసన్నపేట నుంచే ప్రారంభించినట్టు సిఎం
కిరణ్ తెలిపారు.
ఈ ప్రాంతం నుంచి మంచి కార్యక్రమాలు
ప్రారంభించడం తనకు సెంటిమెంటన్నారు. కాంగ్రెస్
అభ్యర్థి ధర్మాన రాందాస్ను అత్యధిక మెజార్టీతో
గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నర్సన్నపేట సభలో మంత్రి ధర్మాన
ప్రసాద రావు మాట్లాడుతూ తాను
పార్టీ మారబోతున్నట్టు తన అన్నయ్య ధర్మాన
కృష్ణదాస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తే బాధ కలుగుతోందని చెప్పారు.
తాను ఆయనలా గాలివాటం మనిషిని
కాదన్నారు. కాగా ఇటీవల మంత్రి
డిఎల్ రవీంద్రా రెడ్డి దమ్ముంటే కిరణ్ వైయస్ఆర్ కాంగ్రెసు
పార్టీ అధినేతను విమర్శించాలని సవాల్ చేసిన విషయం
తెలిసిందే.
కాగా
అంతకుముందు వర్షం వల్ల సభకు
స్వల్ప అంతరాయం కలిగింది. మొదట్లో వాతావరణం ఆందోళన కలిగించినా చివరకు ఊపిరి పీల్చుకొనేలా చేసింది.
సాయంత్రం 4 గంటలకు ఒక మాదిరి వర్షం
కురిసింది. సిఎం ఇక్కడకు చేరుకోవడానికి
పది నిమిషాల ముందు వర్షం తగ్గడం,
ప్రజలు అధిక సంఖ్యలో సభా
ప్రాంగణంలోకి రావడం ఒకేసారి జరిగాయి.
సిఎం ఉపన్యాసం ప్రారంభించినపుడు కూడా వర్షం పడుతూనే
ఉంది. అయినప్పటికీ సిఎం తన ప్రసంగాన్ని
కొనసాగించారు. ఎప్పటికీ వర్షం తగ్గకపోవడంతో జనం
వెనక్కి మరులుతున్న విషయాన్ని గమనించిన సిఎం తన ప్రసంగాన్ని
అర్ధాంతరంగా ముగించక తప్పలేదు.







0 comments:
Post a Comment