హైదరాబాద్:
ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు
తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. ఏ సమస్యా లేదని
భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా వల్లభనేని వంశీ
రూపంలో హీరో జూనియర్ ఎన్టీఆర్
సెగ తాకింది. కాంగ్రెసు పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
ఎదుర్కోవడం కష్టంగానే ఉంది. తనకు ముఖ్యమంత్రి
పదవి దక్కలేదనే ఆగ్రహంతో వైయస్ జగన్ కాంగ్రెసు
పార్టీ నుంచి వైదొలిగి విడిగా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెసు ఆంతరంగిక సమస్యనే వైయస్ జగన్ పార్టీ
పెట్టేందుకు దారి తీసింది.
వైయస్
జగన్ తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం చేస్తారని
భావిస్తున్నప్పటికీ ఆయన కాంగ్రెసు పార్టీనే
ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు
తాగిస్తున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎదుర్కుంటున్న
18 స్థానాలు కూడా కాంగ్రెసు పార్టీవే.
వాటిని నిలబెట్టుకోవాల్సిన అగత్యంలో కాంగ్రెసు పార్టీ పడింది. నిలబెట్టుకోవడం మాట అటుంచి, మెజారిటీ
స్థానాలు గెలుచుకుంటే చాలుననే పరిస్థితికి వచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి
మరణం తర్వాత వైయస్ జగన్ రాజకీయాలు
కాంగ్రెసు పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువనీయడం లేదు. ఎప్పటికప్పుడు అస్థిరతలో,
అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నది. వచ్చే ఉప ఎన్నికల్లో
కొన్ని స్థానాలనైనా గెలుచుకోకపోతే కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం
కష్టమేమీ కాదని అంటున్నారు.
కాగా,
ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాలు కూడా తమవి కాకపోయినప్పటికీ
వాటిలో అపజయాన్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
సిద్ధంగా లేరు. వాటిలో కొన్ని
స్థానాలనైనా గెలుచుకుంటే తమ భవిష్యత్తు పట్ల
పార్టీ శ్రేణులకు ఆశలు చిగురుస్తాయని అనుకుంటున్నారు.
ఇందుకు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఉప ఎన్నికలపై దృష్టి
పెట్టిన స్థితిలో వల్లభనేని వంశీ రూపంలో సమస్య
ముందుకు వచ్చింది.
వల్లభనేని
వంశీ వెనక జూనియర్ ఎన్టీఆర్
ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పరిణామాలు చూస్తుంటే అందులో నిజం లేకపోలేదని అనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తన వర్గాన్ని వైయస్సార్
కాంగ్రెసు పార్టీలోకి పంపడానికి లేదా ఉప ఎన్నికల్లో
నిష్క్రియాపరుగులుగా మిగిలిపోవడానికి అనుగుణంగా మలుచుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామం వల్ల
ఉప ఎన్నికల్లో ఏదో మేరకు తెలుగుదేశం
పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు.
2014లో, లేకుంటే అంతకు ముందుగానే వచ్చే
ఎన్నికల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వైయస్ జగన్ ఉరకలు
వేస్తుంటే, ఆ తర్వాతి రాజకీయాల
కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు
ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏమైనా, వైయస్ జగన్, జూనియర్
ఎన్టీఆర్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు తలనొప్పిగానే మారారని అంటున్నారు.
0 comments:
Post a Comment