న్యూఢిల్లీ:
తెలంగాణ కోసం పట్టుబడుతున్న తెలంగాణ
ప్రాంత పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు పార్టీ అధిష్టానం బుజ్జగిస్తోంది. బుధవారం సమావేశాలు ప్రారంభమయ్యాక తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ఎంపీలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు, విజయశాంతిలు లోకసభలో
సమావేశాలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కెసిఆర్, విజయశాంతిలు ఓ సమయంలో వెల్లోకి చొచ్చుకు వెళ్లే
ప్రయత్నాలు చేశారు.
ఎంపీలు
తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అక్కడే బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సమావేశాలకు తీవ్ర
అడ్డు ఏర్పడింది. స్పీకర్ మీరా కుమార్ వారికి
నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో స్పీకర్
లోకసభను పన్నెండు గంటలకు వాయిదా వేశారు.
సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెసు
పార్టీ నేతలు ఎంపీలను బుజ్జగించే
ప్రయత్నాలు చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ తెలంగాణ ప్రాంత ఎంపీలతో భేటీ అయ్యారు. వారిని
బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు వాయలార్ రవి కెసిఆర్, విజయశాంతితో
భేటీ అయ్యారు.
సభను
అడ్డుకోవద్దని వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారిని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే వారిని కలిసిన
వాయలార్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయ కోణంలో
వారిని కలవలేదని చెప్పారు.
కెసిఆర్
తనకు ఎంతో కాలంగా తెలుసునని,
ఆయన తనకు పాత మిత్రుడని
అందుకే కలిసినట్లు చెప్పారు. గతంలోనూ పలుమార్లు అతనిని కలిసినట్లు చెప్పారు. అలాగే విజయశాంతి తెలుగుతో
పాటు మళయాళంలోను పలు చిత్రాలలో నటించిందని,
ఆమె కేరళ ఇండస్ట్రీకి పరిచితులు
అని చెప్పారు.
తాను
ఆమె నటించిన పలు మళయాళ చిత్రాలు
చూశానని, వాటి పైనే ఆమెతో
మాట్లాడినట్లు చెప్పారు. రాజకీయాలు ఏమీ వారితో మాట్లాడలేదన్నారు.
కాగా కెసిఆర్, విజయశాంతిలతో భేటీ అనంతరం వాయలార్
రవి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలను కలిశారు. సభలో ఆందోళన చేయవద్దని
చెప్పేందుకే వారిని కలిసినట్లుగా తెలుస్తోంది. కాగా వాయిదా అనంతరం
సభ తిరిగి పన్నెండు గంటలకు ప్రారంభమైంది.
0 comments:
Post a Comment