కాంగ్రెసు
పార్టీ శాసనసభ్యులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వల
వేస్తున్నారు. ఇంతకు ముందు తన
వైపు ఉండి, తిరిగి వెనక్కి
వెళ్లిపోయిన శాసనసభ్యులపై ఆయన దృష్టి సారించినట్లు
చెబుతున్నారు. ఇందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొంత మంది తీవ్రంగా
ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు శానససభ్యుడు ఆళ్ల
నాని వైయస్ జగన్ వెంట
వెళ్లడం, బొబ్బిలి శాసనసభ్యుడు రంగారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడడం వంటి పరిణామాలు కాంగ్రెసు
పార్టీని కలవరానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకరిద్దరు
శాసనసభ్యులు వెళ్లిన తమకు ఢోకా లేదని
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినప్పటికీ
ఆ సంఖ్య అంత మాత్రానికే
పరిమితం కాదనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
జగన్తో గతంలో సన్నిహిత
సంబంధాలు నెరిపి, ప్రయత్నాల ఫలితంగా వెనక్కి వచ్చిన శాసనసభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. వారితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు.
ఎవరెవరిపై
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దృష్టి పెట్టారనే విషయంపై కాంగ్రెసు నాయకులు దృష్టి పెట్టారు. వారి పేర్లు తెలిస్తే
వారికి నచ్చజెప్పే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సిబిఐ జగన్ను
ఎప్పుడు అరెస్టు చేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని
ఉంది. ఈ స్థితిలో జగన్కు అండగా నిలువాలని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
మొదట్లో
వైయస్ జగన్ వెంట 29 మంది
కాంగ్రెసు శాసనసభ్యులు ఉండేవారు. కాంగ్రెసు నాయకుల ఒత్తిడి వల్ల, బుజ్జగింపుల వల్ల
జగన్ వెంట నడిచే శాసనసభ్యుల
సంఖ్య 17కి పడిపోయింది. మిగతా
శాసనసభ్యులు కాంగ్రెసు వెంట నడుస్తున్నప్పటికీ ఎప్పుడైనా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
వైయస్
జగన్ వెంట నడిచిన 16 మంది
కాంగ్రెసు శాసనసభ్యులు పార్టీ విప్ను ధిక్కరించి,
తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో వారిపై అనర్హత వేటు పడింది. అప్పటి
ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి రాజీనామా
చేశారు. దాంతో ఇప్పుడు ఆ
17 స్థానాలకే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏలూరు శానససభ్యుడు ఆళ్ల నాని ఒక్కసారిగా
వైయస్ జగన్ వైపు వచ్చేశారు.
విజయవాడకు చెందిన జోగి రమేష్ కూడా
జగన్ వైపు వెళ్తారనే ప్రచారం
శుక్రవారం ఊపందుకుంది.
దాంతో
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, విజయవాడ
పార్లమెంటు సభ్యుడు లడపాటి రాజగోపాల్ ఆయనతో ఫోనులో మాట్లాడారు.
కేరళలోని కొచ్చిన్ పర్యటనలో ఉన్న ఆయన తాను
పార్టీని వీడబోనని చెప్పారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై కూడా వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ శాసనసభ్యుడిపై, ఉత్తరాంధ్రకు
చెందిన మరో ఎమ్మెల్యేపై వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment