గుంటూరు:
ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యురాలు సుచరిత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి రూ.10 కోట్లు
తీసుకొని రాజీనామా చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆరోపించారు. ఆయన గుంటూరు జిల్లా
నుండి హెలికాప్టర్లో శ్రీ పొట్టి
శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఉప ఎన్నికల ప్రచారం
కోసం బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. వైయస్ జగన్ పాపం
పండింది కాబట్టే జైలుకు వెళ్లాడన్నారు.
రాజీనామాలు
ఓ ఫ్యాషన్గా మారిపోయాయని, జగన్
ప్యాకేజీ ప్రకటించి రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబం లక్ష కోట్లు ఎలా
సంపాదించిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కర్నాటక
మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి
దేవుడికే లంచం ఇవ్వబోయారన్నారు. పదే
పదే రాజీనామాలు చేసే వారిని పదేళ్లు
ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావులు కుమ్మక్కై ఎమ్మెల్యేలతో పదే పదే రాజీనామాలు
చేయిస్తున్నారని ఆరోపించారు.
అంతకుముందు
రోడ్ షోలలో మాట్లాడారు. ప్రజలు
ప్రలోభాలకు లోనై జీవితాలను అంధకారం
చేసుకోవద్దని సూచించారు. ఒక్కొక్క అభ్యర్థికి పది కోట్ల రూపాయల
వరకు ఇచ్చి ఎర వేస్తున్నారని,
దీనివల్ల రాజకీయాల్లో సేవాభావం అనేది పోయి పరిస్థితులు
మరింత దిగజారిపోతున్నాయన్నారు. ఏ తప్పు లేకుండా
ఎవరూ జైలుకు వెళ్లబోరని, ఓ కుటుంబం స్వార్థం
వల్లే అధికారులు, పారిశ్రామికవేత్తలు, చివరకు మంత్రులు కారాగారానికి వెళ్లాల్సి వస్తోందన్నారు.
జగన్కు డబ్బు, అధికారం
మినహాయిస్తే మరో ధ్యాస లేదన్నారు.
జగన్ అన్యాయాలు, సంపాదన, అరాచకాలు అతని తల్లి పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఎందుకు
కనిపించడం లేదని ప్రశ్నించారు. లక్షల
కోట్ల రూపాయలు దోచుకొని జైలుకెళ్తే ఏదో అన్యాయం చేశారని
ఆమె అంటున్నారని, అరాచకాలకు అడ్డుకట్ట వేసి ధర్మాన్ని కాపాడాలని
ప్రజలను కోరారు. ఈ ఎన్నికలలో లాలూచీ
పడి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులకు ఓటు వేస్తే రాష్ట్రం
ఆటవిక రాజ్యం అవుతుందని హెచ్చరించారు.
కులం
పెద్దలు గీసిన గీత అయితే,
మతం ఓ విశ్వాసమని, అవినీతికి
పాల్పడవద్దని అన్ని మతాల సారాంశమని
ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలంతా మరో మహోద్యమానికి ముందుకు
రావాలని బాబు పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment