వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని తీసుకు వచ్చినప్పటికీ అది ఫలించలేదు. ఉప
ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలను ఆశించింది.
కానీ రెండు సీట్లు మినహా
పరువు దక్కించుకోలేక పోయింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మృతి తర్వాత జగన్ కాంగ్రెసు పార్టీతో
విభేదించి... బయటకు వచ్చి ఆ
తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు.
జగన్
బయటకు వెళితే ఇంతలా కాంగ్రెసు దెబ్బ
తింటుందని కాంగ్రెసు నేతలు భావించి ఉండరు.
అందుకే ఆయన బయటకు వెళ్లినప్పుడు
అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ తన
తండ్రి ఉన్నప్పుడు ప్రజలలో లేకపోయినప్పటికీ.. వైయస్సార్ పైనున్న అభిమానం, సానుభూతి మాత్రం ఆయనకు బాగా కలిసి
వచ్చాయి. దీంతో 127 ఏళ్ల కాంగ్రెసు, 30 ఏళ్ల
తెలుగుదేశం పార్టీకి మేకు అయి కూర్చున్నాడు.
ఆ తర్వాత్తర్వాత జగన్ ప్రభంజనాన్ని గమనించిన
కాంగ్రెసు ఎలాగైన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు, 2014 గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది.
అందులో భాగంగా చిరంజీవిని మచ్చిక చేసుకొని.. ఆయన ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెసులో విలీనం చేసుకుంది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీకి 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.
అంతేకాదు టిడిపిని అధికారంలోకి రాకుండా చేసింది. చిరంజీవి పిఆర్పీని స్థాపించకపోయి ఉంటే కాంగ్రెసు అధికారంలోకి
వచ్చి ఉండేది కాదని, చంద్రబాబే సిఎం అయ్యే వారనే
వాదన ఉంది.
ఇంతటి
ప్రభంజనాన్ని సృష్టించిన చిరంజీవి ద్వారా జగన్ను ఎదుర్కొనేందుకు
కాంగ్రెసు ప్రయత్నాలు చేసింది. రాష్ట్రంలో చిరంజీవికి ఉన్న ఇమేజ్ను
క్యాష్ చేసుకోవాలని భావించింది. కానీ ఒంటరిగా 2009లో
భారీ ఓట్లు సాధించిన చిరంజీవి
కాంగ్రెసులో కలిశాక ఆ పార్టీకే కాదు..
ప్రజలకు కూడా సముద్రంలో నీటి
చుక్క అయిపోయారు. దీంతో కాంగ్రెసుకు చిరంజీవి
ఇమేజ్ కలిసి రాలేదు. గతంలో
కడప, పులివెందుల, కొవూరు ఉప ఎన్నికలు జరిగాయి.
అప్పుడు
చిరంజీవి ప్రచారం చేసినప్పటికీ జగన్, విజయమ్మ, నల్లపురెడ్డి
ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు.
తాజా ఉప ఎన్నికలలోనూ చిరంజీవి
కాంగ్రెసు గెలుపు కోసం శాయశక్తులా కృషి
చేశారు. కానీ ఫలితం మాత్రం
నిరాశజనకమే. చిరంజీవి కనీసం తన పాత
నియోజకవర్గం అయిన తిరుపతిలో కూడా
అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారు. రామచంద్రాపురం, నర్సాపురంలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ అక్కడ సామాజిక కోణం,
పార్టీ నేతల కలసి కట్టుతనం
తదితర కారణాల వల్ల గెలిచిందే తప్ప
మరెవరి కారణంగానో గెలవలేదు.
మొత్తానికి
జగన్ను ధీటుగా ఎదుర్కొని
రాష్ట్రంలో పార్టీని కాపాడగల సత్తా చిరంజీవికే ఉందని
భావించిన కాంగ్రెసుకు ఇప్పుడు షాక్ తగిలిందనే చెప్పవచ్చు.
అయితే సానుభూతి తదితర కారణాల వల్ల
ఇప్పటికిప్పుడు జగన్ వైపు ప్రజలు
మొగ్గినా 2014 వరకు ఏమవుతుందో చూడాలి.
అప్పటికి జగన్ పైన సానుభూతి
తగ్గుతుందా... చిరంజీవి కాంగ్రెసును పట్టాలెక్కిస్డా లేదా అనేది భవిష్యత్తులో
తేలనుంది.
0 comments:
Post a Comment