ఉప ఎన్నికల్లో పరాజయం కారణంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
విచిత్రమైన సూచనలు పార్టీ నాయకులకు వస్తున్నాయట. పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిందేనని
అంటున్న ఆ నాయకులు విచిత్రమైన
ప్రతిపాదనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా చంద్రబాబు
నాయుడికి తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్,
జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ పేర్లు మాత్రమే వినిపిస్తూ వచ్చాయి. తాజాగా, బ్రాహ్మణిని పార్టీ ప్రచారం కోసం వాడుకోవాలనే ప్రతిపాదన
చంద్రబాబు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.
బాలకృష్ణ,
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగే ఎన్నికల ప్రచారం చేస్తారని, అయితే కొత్తదనం కావాలంటే
బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని ప్రచార రంగంలోకి దింపాలని అనంతపురం తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు సూచించారని అంటున్నారు. చంద్రబాబు కోడలు కూడా అయిన
బ్రాహ్మణిని పార్టీ ప్రచారానికి ఉపయోగిస్తే బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని, ఎన్టీఆర్ మనవరాలిగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం
పడతారని వారు చెప్పారని అంటున్నారు.
అయితే,
పార్టీ బలోపేతానికి జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకోవాలని ఎక్కువ
మంది సూచించారని అంటున్నారు. అనంతపురం జిల్లా నాయకులు మాత్రం బ్రాహ్మణి పేరును ముందుకు తెచ్చారని అంటున్నారు. లోకేష్‌తో పెళ్లి తర్వాత
బ్రాహ్మణి విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల వైపు ఆమె ఎప్పుడూ
చూడలేదు. అయినా, బ్రాహ్మణి ప్రవేశం పార్టీకి ఊపును ఇస్తుందని తెలుగు
తమ్ముళ్లు భావిస్తున్నారు.
మొత్తం
మీద, స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ
సభ్యులను పార్టీకోసం వాడుకోక తప్పదనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్ల నుంచి బలంగా వినిపిస్తోంది.
నారా లోకేష్ పేరు కూడా ముందుకు
వస్తున్నప్పటికీ, ఆయనతో పాటు నందమూరి
హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఉండాల్సిందేనని అంటున్నారు. ఈ వ్యవహారమంతా చంద్రబాబుకు
పెద్ద తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment