ఇప్పుడు
సినిమా బజారులో పడిపోయింది. ‘గతంలో సినిమా తారలను
జనాలు చాలా గొప్పగా చూసేవారు.
ప్రతి విషయంలోనూ సినిమా వాళ్లనే అనుకరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి
అలా లేదు. అప్పట్లో సినిమా
జన సామాన్యానికి దూరంగా ఉండేది. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, నటీనటులు
ఎక్కడ ఉంటారో తెలిసేది కాదు. అందుకే సినిమా
వాళ్లమైన మేమందరం బజారున ఉన్నాం'' అని నటుడు కోట
శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు (10న) ఆయన పుట్టిన
రోజు. ఈ సందర్భంగా మీడియాతో
ముచ్చటిస్తూ కోట పై విధంగా
స్పందించారు.
అలాగే
...''ప్రతీసారి ఒకే తరహా పాత్రలొస్తున్నా,
సాధ్యమైనంత వరకూ కొత్తగా నటించడానికి
ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో నేటి
రాజకీయ నాయకులే నాకు స్ఫూర్తి. ఏ
ఛానెల్ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. వారి హావభావాలు అనుకరిస్తే
సరిపోతుంది'' అన్నారు కోట శ్రీనివాసరావు. ఇప్పటివరకూ
700 పై చిలుకు చిత్రాల్లో నటించాను. అందులో విలన్ పాత్రలతో పాటు
మనసున్న పాత్రలు కూడా చాలా చేశాను.
ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, బృందావనం లాంటి చిత్రాల్లో నేను
పోషించిన పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.
ముఖ్యంగా ‘ఆడవారి మాటలకు...' చిత్రంలోని నా పాత్ర చూసి
రామానాయుడుగారు ‘‘ఏడిపించావయ్యా...'' అంటూ అభినందించడం మరచిపోలేను
అని చెప్పారు కోట.
తన సినీ ప్రయాణం గురించి
మాట్లాడుతూ ''రవీంద్రభారతిలో నా నాటకం చూసిన
దర్శకుడు సీఎస్ రావు గారు
క్రాంతికుమార్‌గారికి నన్ను పరిచయం చేశారు.
ఆయన ‘ప్రాణం ఖరీదు'(1978)తో నాకు తొలి
అవకాశం ఇచ్చారు. బ్యాంక్ ఉద్యోగినైన నేను ఆ తర్వాత
అయిదారేళ్ల పాటు సినిమాల్లో నటించలేకపోయాను.
కొన్నాళ్ల తర్వాత పీఎల్ నారాయణగారి ‘కుక్క'
చిత్రంలో విలన్‌గా చేశాను.
తర్వాత జంధ్యాల అమరజీవి, బాబాయ్ అబ్బాయ్ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాను.
నాటక కళాకారుడ్ని కావడంతో టి.కృష్ణగారు ‘వందేమాతరం'
సినిమాలో ఓ మంచి పాత్ర
ఇచ్చారు. తర్వాత ఆయనే ‘ప్రతిఘటన'లో
మంత్రి పాత్ర నాతో చేయించారు.
ఇక అప్పట్నుంచీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది'' అన్నారు.
ఇక ఈ ప్రయాణంలో చెప్పుకోదగిన
పాత్రలు ఎన్నో లభించాయి. అదంతా
దర్శకులు నాకిచ్చిన అవకాశం. ఇది వరకు కథానాయకుడు,
ప్రతినాయకుడు ఇద్దరి పాత్రలూ చాలా పోటాపోటీగా ఉండేవి.
అందుకే ప్రతి'నాయకుడు' అని
పిలిచేవారు. ఇప్పుడు ఆ స్థాయి కనిపించడం
లేదు. ఫిల్మ్ వృథా అనే భయం
ఎప్పుడైతే పోయిందో... దర్శకులంతా టేకుల మీద టేకులు
అడుగుతున్నారు. ఏమన్నా అడిగితే 'ఇది డిజటల్ యుగం'
అంటున్నారు. ఒకే సన్నివేశం పది,
పదిహేను రకాలుగా తీస్తున్నారు. అందులో ఏది తెరపై కనిపిస్తుందో
మాకే తెలీదు. మన దగ్గర పరాయివాళ్ల
ఆధిపత్యం ఎక్కువైంది. అలాగని నేను పరభాషా నటులకు
వ్యతిరేకి కాను. నసీరుద్దీన్‌షా,
నానాపటేకర్‌లాంటి హేమాహేమీలతో నటించాలని
నాకూ ఉంటుంది. కానీ నిజంగా అలాంటి
వాళ్లు రావడం లేదనే నా
బాధంతా. దర్శకత్వం చేయాలి అనే ఆలోచన లేదు.
ఎవరి పని వాళ్లు చేసుకోవడమే
గౌరవం'' అన్నారు. ఏ పాత్రనైనా అవలీలగా
చేసే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు
ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
0 comments:
Post a Comment