ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కష్టాల్లో పడినట్లే కనిపిస్తున్నారు. మాజీ మంత్రి పి.
శంకరరావు ఈసారి కిరణ్ కుమార్
రెడ్డిపై మరో ఆస్త్రం ప్రయోగించారు.
కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న గులాం నబీ ఆజాద్
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా రాసిన
లేఖ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
చెత్తకుండీలో పడి ఉందని ఆయన
ఆరోపించి మరో బాంబు పేల్చారు.
నిరుడు నవంబర్ 14వ తేదీ ఆజాద్
రాసిన లేఖ చెత్తకుండీలో పడిందని
ఆయన చెప్పారు.
అదేం
ఆషామాజీ లేఖ కాదు. రాష్ట్రానికి
ప్రయోజనం చేకూర్చే లేఖ. రాష్ట్రంలోని నూతన
నర్సింగ్ కళాశాలలకు కేంద్రం 85 శాతం నిధులు ఇస్తుందని
తెలియజేస్తూ ఆజాద్ ఆ లేఖ
రాశారు. అంత ముఖ్యమైన లేఖ
చెత్తకుండీలో పడి ఉండటం షాక్
కలిగించే విషయమే. అయితే, ఆ లేఖ తనకు
అందలేదని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డి అంటున్నారు.
సచివాలయంలోని
ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల్లో దాదాపు 3 లక్షల ఫైళ్లు అపరిష్కృతంగా
ఉన్నాయని శంకరరావు అంటూ ప్రభుత్వం పనే
చేయడం లేదనే కలర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను, మంత్రులు, శాసనససభ్యులు పంపిన ప్రతిపాదనలను చెత్తకుండీల్లో
వేశారని శంకరరావు చెప్పారు. గత ప్రజాపథం కార్యక్రమంలో
ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ప్రజాపథం కార్యక్రమంలో ఇటీవల కాంగ్రెసు శాసనసభ్యుడు
పి. విష్ణువర్ధన్ రెడ్డి అధికారులను నిర్బంధించారు.
ముఖ్యమంత్రి
పని చేయడం లేదనే కాదు,
ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నాలు
చేయడం లేదని తాజాగా శంకరరావు
కూడా విసుర్లు విసిరినట్లే. కిరణ్ కుమార్ రెడ్డిని
నియంత్రించే రిమోట్ చెన్నైలోనో బెంగళూర్లోనో ఉందని అంటున్నారని
శంకరరావు వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యమంత్రి తమ్ముళ్లపై
శంకరరావు చేసిన పరోక్ష వ్యాఖ్య.
ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి
ఇది కష్టకాలమే.
0 comments:
Post a Comment