హైదరాబాద్:
నీ పని అయిపోయిందిరా అన్నందుకే
భాను కిరణ్ మద్దెలచెర్వు సూరిని
హత్య చేశాడని సిఐడి డిజి రమణమూర్తి
మీడియా ప్రతినిధులతో చెప్పారు. జహీరాబాద్ వద్ద అరెస్టు చేసిన
భాను కిరణ్ను సిఐడి
పోలీసులు శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో
మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీడియాతో
సిఐడి డిజి రమణమూర్తి మాట్లాడారు.
రమణమూర్తి మాట్లాడుతున్నంత సేపు, మీడియా ప్రతినిధులు
ప్రశ్నలు వేస్తున్నప్పుడు భాను కిరణ్ రెండు
మూడు సార్లు వంకరగా నవ్వుతూ కనిపించాడు. భాను కిరణ్ను
శనివారం ఉదయం పది గంటలకు
జహీరాబాద్ సమీపంలో అరెస్టు చేసినట్లు రమణమూర్తి చెప్పారు. సూరి నుంచి ప్రాణహాని
ఉందని భావించి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని ఆయన చెప్పారు. హత్యకు
ముందు రెండు సార్లు సూరి
హత్యకు ప్రయత్నించాడని, అయితే అది సూరి
గ్రహించలేదని ఆయన చెప్పారు.
పాండిచ్చేరి
నుంచి డబ్బుల కోసం జహీరాబాద్ వచ్చాడని,
గత నెల రోజులుగా అతను
పాండిచ్చేరిలో ఉంటున్నాడని, ఇంటలిజెన్స్ సమాచారం మేరకు తాము భానును
అరెస్టు చేశామని, తాము భానును అరెస్టు
చేసినప్పుడు ఇతరులెవరూ లేరని ఆయన చెప్పారు.
మనూష్ కుంజూగా పేరు మార్చుకుని భాను
కిరణ్ మధ్యప్రదేశ్లోని శినోయి గ్రామంలో
ఉంటున్నాడని ఆయన చెప్పారు. తమకు
పక్కాగా అందిన సమాచారం మేరకే
భానును అరెస్టు చేశామని, సమాచారం అందించిన వ్యక్తి పేరును రహస్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.
అరెస్టు
చేసినప్పుడు క్యాప్ పెట్టుకుని ఉన్నాడని, పోలీసులతో భాను పెనుగులాడాడని ఆయన
చెప్పారు. జహీరాబాద్ నుంచి తరలించేందుకు మూడు
గంటలు పట్టిందని, ఆ తర్వాత తాను
భాను కిరణ్ను తాను
విచారించానని, భాను చెప్పిన ప్రతి
విషయాన్ని రికార్డు చేశామని ఆయన అన్నారు. భానుకు,
మద్దెలచెర్వుకు సూరికి మధ్య ఉన్న వైరం
ఏమిటనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రమణమూర్తి చెప్పారు. ఆరు గంటల పాటు
భానును సిఐడి పోలీసులు విచారించారు.
సూరి పేరు మీద పెద్ద
యెత్తున డబ్బులు సంపాదించారని, బెదిరించి డబ్బులు సంపాదించాడని, భాను స్వయంగా తానే
బెదిరించాడని రమణమూర్తి చెప్పారు. పెద్ద యెత్తున హైదరాబాదు
శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
చేశాడని, ఇందులో కొంత మందిని బెదిరించాడని,
బినామీ పేరు మీద భాను
కిరణ్ ఆస్తులను పెట్టాడని, దీంతో సూరి భాను
కిరణ్ను బెదిరించాడని రమణమూర్తి
చెప్పారు. ఆ ఆస్తులను సూరి
పేరు మీద బదిలీ చేస్తానని
చెప్పాడని, సూరి అందుకు చిత్రహింసలు
పెట్టడంతో సూరిపై కక్ష పెంచుకున్నాడని ఆయన
వివరించారు.
శినోయి
గ్రామంలో అతను రేషన్ కార్డు,
పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని ఆయన చెప్పారు. టాటా
స్కై ద్వారా రాష్ట్రానికి చెందిన వార్తలు చూసేవాడని ఆయన చెప్పారు. హైదారాబాదు
నుంచి పారిపోయిన భాను జహీరాబాద్, కర్ణాటక,
పూణే, ఢిల్లీ, షోలాపూర్ చేరుకున్నాడని ఆయన చెప్పారు. గుర్గావ్లోని శర్మ లాడ్జిలో
మన్మోహన్ సింగ్తో కలిసి
ఉన్నాడని ఆయన చెప్పారు. అక్కడి
నుంచి మన్మోహన్ను పంపించి అన్ని
రాష్ట్రాలు తిరిగాడని, పుణ్య క్షేత్రాలు తిరిగాడని
ఆయన చెప్పారు. చివరి శినోయిలో స్థిరపడి
గత మూడు నెలలుగా ఉంటున్నాడని
ఆయన చెప్పారు.
మీడియా
ముందు ప్రవేశపెట్టిన సమయంలో భాను కిరణ్ కళ్లజోడు
పెట్టుకుని ఉన్నాడు. టీ షర్ట్ ధరించి
ఉన్నాడు. భాను శినోయిలో ఉండడానికి
ముందుకు కేరళ, తమిళనాడు, తదితర
రాష్ట్రాల్లో లాడ్జీల్లో ఉంటూ వచ్చాడని ఆయన
చెప్పారు. శినోయిలో కూడా పాన్ కార్డు,
డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వివిధ
పేర్ల మీద తీసుకున్నాడని రమణమూర్తి
చెప్పారు. భాను కిరణ్పై
15 కేసులున్నాయని, హైదరాబాదులో ఐదు కేసులున్నాయని ఆయన
చెప్పారు. పారిపోయిన తర్వాత భాను ఆంధ్రప్రదేశ్లో
అడుగు పెట్టలేదని ఆయన చెప్పారు. ఖమ్మంలో
తీసుకున్న గన్ లైసెన్స్ను
ఒడిషాకు మార్చుకున్నాడని ఆయన చెప్పారు. ఢిల్లీ,
షోలాపూర్, గుర్గావ్ల్లో మన్మోహన్తో
కలిసి ఉన్నాడని ఆయన చెప్పారు.
భాను
నుంచి రెండు రివాల్వర్లు స్వాధీనం
చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సూరి
హత్యకు ముందు భాను కిరణ్
నాలుగు లక్షల రూపాయలు రెడీ
చేసుకున్నాడని ఆన చెప్పారు. శినోయిలో
మూడు వేల రూపాయలతో అద్దె
ఇంట్లో ఉంటూ వచ్చాడని ఆయన
చెప్పారు. శినోయిలో తప్ప మరెక్కడా భాను
సొంత సెల్ ఫోన్ను
వాడలేదని, ఎక్కడ ఉంటే అక్కడ
బూత్ల ద్వారా ఫోన్లు
చేసేవాడని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్
సిమ్ కార్డు మాత్రమే భాను వద్ద ఉందని,
దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. సూరి
హత్య కేసులో మధుమోహన్ లేడని, అరెస్టు చేసిన నలుగురు మాత్రమే
ఉన్నారని ఆయన చెప్పారు.
భాను
కిరణ్ నుంచి ఇంకా కూపీ
లాగుతున్నామని, ఇంకా ప్రశ్నించాల్సి ఉందని
ఆయన చెప్పారు. భాను కిరణ్ లొంగిపోలేదని,
తామే అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మరింత
ప్రశ్నించిన తర్వాత భాను ఎక్కడెక్కడ మకాం
చేసిందీ తెలుస్తుందని ఆయన చెప్పారు. టీవీ
చానెల్ యాంకర్ శ్వేతారెడ్డితో భాను కిరణ్ సంబంధాలు
ఇప్పుడు చెప్పలేమని ఆయన చెప్పారు. సినిమా
రంగానికి చెందినవారితో సంబంధాల గురించి భాను కిరణ్ అంగీకరించినట్లు
ఆయన తెలిపారు. రేపు ఆదివారం భాను
కిరణ్ను న్యాయమూర్తి ముందు
హాజరు పరుస్తామని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment