హైదరాబాద్:
వచ్చే ఉప ఎన్నికల్లో విజయం
సాధించడానికి కాంగ్రెసు నాయకత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు అర్థమవుతోంది. రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ వరుసగా
మాట్లాడుతున్న తీరు, విజయవాడ పార్లమెంటు
సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఆ
విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 18 శాసనసభ స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప
ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పరకాల మినహా మిగతా
స్థానాలన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. దాంతో కాంగ్రెసు నాయకులు
తెలంగాణ వ్యతిరేక సంకేతాలను పంపుతూ విజయం సాధించే వ్యూహాన్ని
అనుసరిస్తున్నారని అనుకోవచ్చు.
తమ పార్టీ ఓడిపోతే రాష్ట్ర విభజన జరుగుతుందనే అభిప్రాయాన్ని
కాంగ్రెసు నాయకులు ప్రజల మనస్సులో నాటడం
ద్వారా విజయం సాధించాలనే ఉద్దేశంతో
ఉన్నట్లు అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి ఇది ఒక మార్గంగా
వారు ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. మెజారిటీ స్థానాలను వైయస్ జగన్ గెలుచుకుంటే
రాష్ట్ర విభజన జరుగుతుందని పరోక్షంగా
చెబుతున్నారు. వైయస్ జగన్కు
ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటేసినట్లేనని టిజి వెంకటేష్ అంటున్నారు.
తమ పార్టీ అత్యధిక స్థానాలు వస్తే తెలంగాణ సమస్యను
పరిష్కరిస్తామని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీన్నిబట్టి తమ పార్టీ ఎక్కువ
స్థానాలు గెలిస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామనే విషయాన్ని వారు చెప్పకనే చెబుతున్నారు.
వైయస్
జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో
కుమ్మక్కయ్యారని కాంగ్రెసు నాయకులు నేరుగా కూడా విమర్శలు చేస్తున్నారు.
అందుకే, తెలంగాణలో తన పార్టీ అభ్యర్థులను
పోటీకి దించలేదని కూడా అంటూ వస్తున్నారు.
వైయస్చార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని వారు
సంకేతాలు ఇస్తున్నారు. జగన్ను కట్టడి
చేయడానికైనా కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తుందని ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. సమైక్యాంధ్రను కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారని, దానివల్ల విభజన జరుగకుండా చూడడానికి
తమ పార్టీకి ఓటేస్తారని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో
ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. ఆ స్పష్టమైన నిర్ణయం
ఉప ఎన్నికల ఫలితాలను బట్టే ఉంటుందని అంటున్నారు.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఓటేస్తే విభజన జరుగుతుందని, అనుకూలంగా
వేస్తే సమైక్యంగా ఉంటుందని కాంగ్రెసు నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే
ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో తొలి విడత ఎన్నికలు
ముగిసిన తర్వాత సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో వైయస్ రాజశేఖర రెడ్డి
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాదు
వెళ్లడానికి పాస్పోర్టు కావాలని
ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో అన్నారు. దాని వల్లనే సీమాంధ్రలో
కాంగ్రెసు విజయం సాధించిందని కాంగ్రెసు
నాయకులు నమ్ముతున్నారు. అదే వైఖరిని కాంగ్రెసు
నాయకులు రానున్న ఉప ఎన్నికల్లో అనుసరించదలుచుకున్నట్లు
అర్థమవుతోంది
0 comments:
Post a Comment