హైదరాబాద్:
గనుల శాఖలో కీలక నిర్ణయాలన్నీ
అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మికి
తెలిసే, ఆమె అనుమతితోనే జరిగాయని
ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ఎ.దయాకర్రెడ్డి
సీబీఐ అధికారుల ముందు చెప్పారు. అసాధారణ
వేగంతో 2007 జూన్ 18న ఓఎంసీకి మైనింగ్
లీజులు కేటాయిస్తూ 151, 152 జీవోల జారీ వెనక
శ్రీలక్ష్మి నుంచి ఉన్న ఒత్తిడి,
ఆదేశాలే కారణమని ఆయన చెప్పారు. ఈ
మేరకు ఆయన సిబిఐ అధికారులకు
వాంగ్మూలం ఇచ్చారు.
గనుల
శాఖ డైరెక్టర్ రాజగోపాల్ పంపిన ప్రతిపాదనల ఆధారంగానే
జీవో జారీ చేశామని, జీవోలో
విధించాల్సిన నిబంధనలను ఆయన పేర్కొనలేదని దయాకర్
రెడ్డి తెలిపారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి
నోట్ఫైల్ను, ముసాయిదా
ఆదేశాలను ఆమోదించినా, ముసాయిదా ఫైళ్లపై సంతకాలు చేయలేదని ఆయన వెల్లడించారు. కార్యదర్శి
ఆదేశాల ప్రకారమే ఈ విషయంలో ఉప
కార్యదర్శి వ్యవహరించారని తెలిపారు. అన్ని అంశాలపై సంతృప్తి
చెందితేనే లీజు ఒప్పందం అమలు
సమయంలో ముందుకు వెళ్లాలని చెప్పామని, ఇది గనులశాఖ డైరెక్టర్
బాధ్యత అని తెలిపారు. ఏ
విషయంలోనైనా ఆయన సంతృప్తి చెందకపోతే
ప్రభుత్వ ఉత్తర్వుల్లో సవరణల కోసం ప్రతిపాదనలు
పంపించవచ్చునని చెప్పారు.
ఆంధ్రజ్యోతి
దినపత్రిక వార్తాకథనం ప్రకారం - రాజగోపాల్ నుంచి అందిన ప్రతిపాదనల
ఆధారంగా అనంతపురం జిల్లా డి హీరేహళ్ మండలం
సిద్దాపురం, మలపనగుడి ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 1, 2లో
68.5 హెక్టార్ల మైనింగ్ లీజును ఓఎంసీకి కట్టబెట్టేందుకు గనులశాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి రంగం సిద్ధం చేశారు.
ఈ మేరకు 2007 జనవరి 18న కేంద్ర గనులశాఖకు
ఓ లేఖ రాసి ఓఎంసీకి
లీజు కేటాయించేందకు వీలుగా ముందస్తు అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ లేఖపై స్పందించిన
కేంద్రం నోటిఫైడ్ ఏరియాకు సంబంధించి దరఖాస్తుదారుల వివరాలు అందజేయాలని కోరారు. అదే సమయంలో ఓఎంసీకి
సిఫారసు చేసిన ప్రాంతానికి సంబంధించిన
మ్యాపును పంపాలని కోరారు.
ఈ వివరాలు పొందడంతో పాటు ఆయా అంశాల
పరిశీలన కోసం ఫైలును గనుల
శాఖ డైరెక్టర్కు పంపారు. నోటిఫికేషన్కు ముందు అందిన
దరఖాస్తులు, నోటిఫికేషన్ జారీ తర్వాత 30 రోజుల్లో
అందిన దరఖాస్తులు, నోటిఫికేషన్ జారీచేసిన రోజే అందిన దరఖాస్తుల
వివరాలను రాజగోపాల్ పంపారు. నోటిఫికేషన్ మైనింగ్ లీజు కోసం జారీ
చేసినందున ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోలేదు. 2 పీఎల్ దరఖాస్తులను తిరస్కరించిన
తర్వాత ఐదు దరఖాస్తులే పరిశీలనకు
అర్హమైనవని తేల్చారు.
ఈ దరఖాస్తుదారులకు సంబంధించిన అనుభవం, ఆర్థిక స్థోమత తదితర అంశాలను పరిశీలించిన
తర్వాత ఓఎంసీ దరఖాస్తు అత్యుత్తమైనదని
తేల్చారు. ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీకి 25 హెక్టార్ల
లీజును రిజర్వ్చేయాలని నిర్ణయించారు. ఓఎంసీకి కేటాయించదలచిన ప్రాంతం మ్యాపును కూడా రాజగోపాల్ పంపారు.
ఈ వివరాల ఆధారంగా 2007 ఏప్రిల్ 21న పరిశ్రమలశాఖ మరోసారి
ఓఎంసీకి 68.5 హెక్టార్ల మైనింగ్ లీజు కేటాయించేందుకు ముందస్తు
అనుమతి ఇవ్వాలని కేంద్ర గనుల శాఖను కోరింది.
షోకాజ్ నోటీసుల జారీకి సంబంధించిన రసీదులు, వెనక్కి వచ్చిన షోకాజ్ నోటీసులు, సీనియర్ అధికారులు చేసిన మార్పుల తర్వాత
కె.విశ్వేశ్వరరావు అనే అసిస్టెంట్ సెక్షన్
ఆఫీసర్ తుది నోట్ సిద్ధంచేశారు.
దీని
ప్రకారం ఓఎంసీకి 68.52 హెక్టార్ల మైనింగ్ లీజు మంజూరు చేయాలని
నిర్ణయించారు. మైనింగ్ లీజు ఇస్తే రూ.
450 కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడతామని ఓఎంసీ పేర్కొనగా, శాతవాహన
ఇస్పాత్ అనంతపురం జిల్లా బొమ్మనహళ్ వద్ద అప్పటికే ఏర్పాటు
చేసిన పిగ్ ఐరన్ ప్లాంట్కు ఈ నిక్షేపాలను
ఉపయోగిస్తామంది. ఈ ఫైలులో అసిస్టెంట్
సెక్షన్ ఆఫీసర్ సిద్ధం చేసిన నోట్ను
అధికారులు ఎన్నోసార్లు మార్చారు. శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు ముసాయిదా జీవో
సిద్ధం చేయాల్సిందిగా ఉప కార్యదర్శి సూచించారు.
సెక్షన్
అధికారి కె.వి. సుబ్బులు
2007 జూన్ 18న జీవో 151కు
సంబంధించి ముసాయిదా జీవోను సిద్ధం చేసి ఆమోదం కోసం
పంపారు. కార్యదర్శి, ఉపకార్యదర్శుల నుంచి వచ్చిన ఆదేశాల
మేరకే ముసాయిదా జీవో సిద్ధమైంది. ఆ
సమయంలోనే 'క్యాప్టివ్' పదం మాయమైంది. తనతోపాటు
ఉప కార్యదర్శి, కార్యదర్శి ఆమోదం తర్వాత ఫైలును
గనుల శాఖ మంత్రి సబితారెడ్డి
ఆమోదం కోసం పంపారు. తర్వాత
2007 జూన్ 18న ఓఎంసీకి మైనింగ్
లీజు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
0 comments:
Post a Comment