శ్రీకాకుళం:
తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన అడ్డుకోవడం వెనుక ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ
నేత ఎర్రన్నాయుడు ఆదివారం ఆరోపించారు. బాబు పర్యటన అడ్డుకుంటే
టిడిపి నేతలు ప్రతిఘటిస్తారని చెప్పారు.
బాబు ధర్నాను అడ్డుకుంటే మంత్రులను జిల్లాలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.
కాగా
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో తలపెట్టిన పోటా పోటీ దీక్షల
కారణంగా విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ అమలులో
ఉందని పోలీసులు చెప్పారు. అనుమతులు లేకుండా ధర్నాకు దిగితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అవసరమైన పక్షంలో ముందస్తు అరెస్టులకు కూడా వెనుకాడబోయేది లేదని
చెప్పారు.
కాగా
విజయనగరంలో తన ధర్నాను అడ్డుకునే
ప్రయత్నాలపై చంద్రబాబు శనివారం తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మద్యం
సిండికేట్లకు వ్యతిరేకంగా విజయనగరంలో తాను నిర్వహించదలచిన సభకు
పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తప్పు పట్టారు.
సోమవారం తాను విజయనగరం వెళ్ళి
తీరుతానని, తనను ఎవరు ఆపుతారో
చూస్తానని సవాల్ విసిరారు.
ప్రభుత్వంలో
జరుగుతున్న అక్రమాలపై పోరాడటం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత,
హక్కు అని, నన్ను సభ
పెట్టవద్దనడానికి వీళ్లెవరని ప్రశ్నించారు. విజయనగరం ఏమైనా పాకిస్థాన్లో ఉందా? వీసా కావాలా
అని ప్రశ్నించారు. పిచ్చిపిచ్చిగా చేస్తే సహించేది లేదన్నారు. తాను ఏనాడూ ఎవరికీ
భయపడలేదన్నారు. బొత్స సత్యనారాయణ తన
గొయ్యి తాను తవ్వుకొంటున్నాడన్నారు.
వాళ్ళు
రావద్దంటే మానాలి, రమ్మంటే వెళ్ళాలా అని నిప్పులు చెరిగారు.
విజయనగరం ఎస్పీ కూడా వెన్నుముక
లేకుండా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వద్దంటే నా సభకు అనుమతి
ఇవ్వరా? ఇలా తొత్తుల్లా పనిచేసిన
అధికారులు కొందరు జైళ్ళలో కూర్చున్నారన్నారు. దానిని గుర్తుంచుకొంటే మంచిదని సూచించారు. ఘర్షణ వైఖరి వద్దని
తామే ఒక అడుగు వెనక్కు
తగ్గామని, అయినా కావాలని సభ
జరగకుండా అడ్డంకులు కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు.
0 comments:
Post a Comment