హైదరాబాద్:
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో అధికార
కాంగ్రెసు పార్టీ సరికొత్త ప్రయోగంతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు, వ్యతిరేకతను తట్టుకునేందుకు పలు స్థానాలలో కొత్త
వారికి సీటు ఇవ్వాలనే యోచనలో
ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని పద్దెనిమిది అసెంబ్లీ, ఒక లోక్సభ
స్థానాలకు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే.
వాస్తవానికి,
ఉప ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లో తిరుపతి, ఆళ్లగడ్డ మినహా మిగిలిన 16 స్థానాలూ
కాంగ్రెస్ పార్టీకి చెందినవే. ఈ 16 స్థానాల్లోని కాంగ్రెస్
ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వెళ్లి
అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. పదహారు
స్థానాలలో సిట్టింగ్లు గోడ దూకడంతో
ఈ స్థానాల నుంచి కొత్త వారికి
అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఇప్పుడు ఏర్పడింది.
ఇక, రాజ్యసభకు ఎన్నికైనందున చిరంజీవి రాజీనామా చేయడంతో తిరుపతి శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
2009 ఎన్నికల్లో
ఆళ్లగడ్డ నుంచి ప్రజారాజ్యం తరఫున
విజయం సాధించిన శోభా నాగి రెడ్డిపై
అనర్హత వేటు పడింది. ఇలా
కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఈ 18 నియోజకవర్గాల్లో కొత్తవారిని,
గతంలో పిఆర్పీ తరఫున పోటీ చేసి
ఓటమి పాలైనవారిని ఎన్నికల రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ క్రమంలో శ్రీకాకుళం
జిల్లా నరసన్న పేట నుంచి మంత్రి
ధర్మాన ప్రసాద రావు సోదరుడు ధర్మాన
రాందాసు తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన తన సొంత
అన్న ధర్మాన కృష్ణదాసుతో తలపడనుండటం విశేషం.
విశాఖ
జిల్లా పాయకరావుపేట నుంచి కాంగ్రెస్ తరఫున
పోటీ చేసే అభ్యర్థుల పేర్లు
ఖరారు కానప్పటికీ సుజన లేదా విజయా
రావులలో ఒకరికి అవకాశం లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు రంగంలోకి దిగినా
ప్రత్యక్ష ఎన్నికకు వీరు కొత్తవారే అవుతారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ తరఫున
రంగంలోకి దిగుతున్న తోట త్రిమూర్తులు రాజకీయాలకూ,
ప్రత్యక్ష పోరుకూ కొత్తేమీ కాదు.
కానీ,
కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ
చేయడం మాత్రం ఇదే తొలిసారి. 1994లో
ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం
సాధించారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ
అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 1999లో టిడిపి తరఫున
పోటీ చేసి విజయం సాధించారు.
2004లో టిడిపి తరఫున మళ్లీ పోటీ
చేసి ఓడిపోయారు. 2009లో పిఆర్పీ తరఫున
పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి
పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు
సుభాష్ చంద్రబోస్ జగన్ పార్టీ తరఫున
పోటీ చేస్తుండటం, పిఆర్పీ కాంగ్రెసులో విలీనం కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు రంగంలోకి
దిగుతున్నారు. ఇక పొరుగు జిల్లా
పశ్చిమ గోదావరిలోని నరసాపురంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడి నుంచి
పోటీ చేస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త. ఆయన 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో కొనసాగారు.
2009లో
పిఆర్పీ తరఫున పోటీ చేసి
కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద రాజు చేతిలో ఓటమిపాలయ్యారు.
పోలవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా
రంగంలోకి దిగుతున్న దొర రాజకీయ కుటుంబం
నుంచే వచ్చినప్పటికీ ఎన్నికల బరిలోకి దిగడం మాత్రం ఆయనకిదే
తొలిసారి.
గుంటూరు
జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి బరిలోకి దిగనున్న
టిజెఆర్ సుధాకర్ బాబు కూడా ఎన్నికలకు
కొత్తవారే.
రైల్వే
కోడూరు నుంచి పోటీ చేస్తున్న
ఈశ్వరయ్య గతంలో ఇండిపెండెంట్గా
పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం
ఆయనకు ఇదే తొలిసారి. ఇక
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి గంగుల ప్రతాప
రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇక తెలంగాణలో ఉప
ఎన్నిక జరిగే ఏకైక అసెంబ్లీ
సెగ్మెంట్ పరకాల నుంచి కాంగ్రెస్
అభ్యర్థిగా గండ్ర జ్యోతి రంగంలోకి
దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు
ఇదే ప్రథమం.
0 comments:
Post a Comment