కర్నూలు:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు.
పులిని
చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా
కొందరు పార్టీ పెట్టి రెండేళ్లు కూడా నడపలేక పోయారని
చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్లా పార్టీని స్థాపించి
చరిత్ర సృష్టించాలని చూశారని, కానీ రెండేళ్లు కూడా
పార్టీ నడపలేక పోయారన్నారు. సామాజిక న్యాయం అన్న వ్యక్తి చివరకు
తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి సొంత న్యాయం
చూసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. నాటికి నేటికి ఎప్పటికి సినీ చరిత్రలోనూ, రాజకీయాలలోనూ
అగ్రస్థానంలో ఉండే వ్యక్తి ఎన్టీఆర్
ఒక్కరే అన్నారు.
చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే 2009 సాధారణ ఎన్నికలలో టిడిపియే గెలిచేదని ఆయన అన్నారు. ఈ
ప్రజా వ్యతిరేక కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదన్నారు.
కాంగ్రెసు పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు.
కరెంట్ బిల్లులు చూస్తే గుండె గుబేల్ మంటోందని
అన్నారు. వ్యవసాయానికి సమయం ప్రకారం విద్యుత్
ఇవ్వడం లేదని ఆరోపించారు.
తెలుగుదేశం
పార్టీ చేపట్టిన ఉద్యమాల ఫలితంగా రాష్ట్రంలో ఇప్పుడు మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకు అమ్ముతున్నారన్నారు. టిడిపిని ఎవరూ
ఏమీ చేయలేరన్నారు. టిడిపికి కోపమొస్తే రౌడీలు భస్మం అవుతారన్నారు. రాష్ట్రానికి
గులాం నబీ ఆజాద్ సూపర్
సిఎంలా వ్యవహరిస్తున్నారన్నారు.
వాయలార్
రవి, కృష్ణమూర్తి తదితరులు నిత్యం ఇలా జాతీయ నేతలు
రాష్ట్రానికి వస్తూనే ఉంటారన్నారు. ఇక్కడి నుండి సూటుకేసులు తీసుకు
వెళ్లి రాష్ట్ర నేతలకు అక్కడ క్లీన్ చిట్
ఇస్తారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ మునిగిపోయే నావ అన్నారు. ఆ
పార్టీని ఎవరూ కాపాడలేరన్నారు.
టిడిపి
అధికారంలోకి వస్తే ఉచిత బియ్యం
ఇస్తామని చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ను
ఎప్పుడో చంపేస్తారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. భానుకు మంగళి కృష్ణ బాస్
అయితే మంగళి కృష్ణకు వైయస్
జగన్మోహన్ రెడ్డి బాసు అని విమర్శించారు.
చేనేత
కార్మికుల సంక్షేమం కోసం టిడిపి ఉద్యమిస్తోందన్నారు.
చేనేత కార్మికులకు రూ.381 కోట్లు కేటాయించనా కేంద్రం నిధులే విడుదల చేయలేదన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే దోతి, చీర పథకం
తీసుకు వస్తామన్నారు. ఎన్డీయేకి మద్దతిచ్చి తప్పు చేశామన్నారు. భవిష్యత్తులో
బిజెపికి మద్దతిచ్చే ప్రసక్తి లేదన్నారు. మైనార్టీల సంక్షేమానికి టిడిపి కృషి చేస్తుందన్నారు.
ఎమ్మిగనూరులో
రౌడీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
ధర్మరాజు వంటి బివి మోహన్
రెడ్డిని గెలిపించాలని కోరారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు
కోసం తెలుగుదేశం పార్టీ హయాంలో రూ.198 కోట్లు కేటాయించామని, కానీ కాంగ్రెసు నేతల
అవినీతి వల్ల నేటికీ ఆ
పనులు పూర్తి కాలేదని ఆరోపించారు.
0 comments:
Post a Comment