హైదరాబాద్:
రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి
ముఖ్యమంత్రి పీఠం బరిలో నుండి
తప్పుకున్నట్టేనా అంటే అవుననే వాదనలు
వినిపిస్తున్నాయి. 2008లో ఏ లక్ష్యంతో
ప్రజారాజ్యం పార్టీ స్థాపించారో ఆ లక్ష్యం నెరవేరే
అవకాశాలు లేవనే అభిప్రాయానికి వచ్చిన
చిరు ఆ బరి నుండి
తప్పుకున్నారని అంటున్నారు! పిఆర్పీ స్థాపించినప్పుడు చిరు కనీసం అరవై
నుండి డెబ్బై సీట్లను కైవసం చేసుకుంటుందని అందరూ
భావించారు. కానీ అనూహ్యంగా కేవలం
పద్దెనిమిది సీట్లకే పరిమితమవడమే కాకుండా సాక్ష్యాత్తూ చిరంజీవి ఓ స్థానంలో ఓడిపోయాడు.
ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో
చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెసులో విలీనం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం కూలిపోకుండా చేయందించారు. ఆ సమయంలోనే అధిష్టానం
చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తానని హామీ
ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ దిశలో ప్రక్రియ
ఇటీవల చక చకా జరిగిపోతోంది.
ఇప్పటికే ఆయనను రాజ్యసభకు ఎంపిక
చేసిన అధిష్టానం, కేంద్ర మంత్రి పదవిని ఏ సమయంలోనైనా కట్టబెట్టే
అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చిరు సిఎం పోటీ
నుండి తప్పుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు, 2014లోనూ ఆయన ఆ
పదవికి పోటీ పడే అవకాశాలు
లేవని అంటున్నారు. ఆదివారం ముఖ్యమంత్రి బహిరంగ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన చిరంజీవి తనకు ముఖ్యమంత్రి కావాలనే
ఎలాంటి ఆశా లేదని చెప్పారు.
ఆయన కాంగ్రెసులో తన పార్టీని విలీనం
చేసిందే.. 2014లోనైనా సిఎం పీఠమెక్కాలనే భావనతో
అనే ప్రచారం ఉంది.
ముఖ్యమంత్రి
పీఠంపై దృష్టి ఉన్నప్పటికీ అది సాధ్యమయ్యే పని
కాదని భావించే చిరు కేంద్రానికి వెళ్లేందుకు
సిద్ధమయ్యారని అంటున్నారు. అదే సాధ్యమవుతుందని భావిస్తే
ఆయన ఢిల్లీ వెళ్లే వారు కాదని అంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడిన చిరుకు అధిష్టానం చాలా ప్రాధాన్యత ఇస్తోంది.
ఆయన దృష్టి ఖచ్చితంగా ఆ పీఠంపై ఉంటే
2014 వరకు నిరీక్షించే ఉద్దేశ్యంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పదవి
అడిగి ఉండే వారు కదా
అనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు
2014లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చూచాయగా
కనిపించడం లేదని, అందుకే అధికార కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరు ఢిల్లీ
వైపు దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. చిరంజీవికి రాష్ట్రంలో బాగానే ఇమేజ్ ఉన్నప్పటికీ దానిని
ఓట్లుగా మలుచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇటీవల జరిగిన కడప,
పులివెందుల, కొవూరు ఉప ఎన్నికలలో చిరంజీవి
ఇమేజ్ ఏమాత్రం పని చేయలేదనే చెప్పవచ్చు.
అదే సమయంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే '14లో కాంగ్రెసు అధికారంలోకి
రావడం కల్లగా అనిపిస్తోందని, దీంతో ఢిల్లీలో సీటు
రిజర్వ్ చేసుకోవడమే మేలు చిరు భావిస్తున్నారని
అంటున్నారు. మరో కోణం కూడా
ఉంది. ప్రభుత్వాన్ని కాపాడినందుకు అధిష్టానానికి చిరుపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తోంది. అయితే
అది క్రమంగా తగ్గిపోవచ్చు.
ఈ నేపథ్యంలో కేంద్రానికి వెళ్లి అక్కడే, అధిష్టానం పెద్దలతో ఇప్పటి నుండే సాన్నిహిత్యం పెంచుకొని
2014 ఎన్నికల వరకు రూట్ క్లియర్
చేసుకోవాలని చిరంజీవి భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ,
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
వారిద్దరికీ
అధిష్టానం నుండి అక్షింతలు కూడా
పడ్డాయి. ఈ సమయంలో ఇక్కడ
ఉండి కుమ్ములాటల్లో కూరుకు పోవడం ఎందుకని చిరంజీవి
భావించారని అంటున్నారు. మొత్తానికి చిరంజీవి ఢిల్లీ వెళ్లింది.. సిఎం పీఠం నుండి
తప్పుకునేందుకా? '14లో ఎలాగూ పార్టీ
గెలవదనా? లేక అధిష్టానం పెద్దలను
ఇప్పటి నుండే మచ్చిక చేసుకోవడానికా?
అనేది ముందు ముందు తేలనుంది.
0 comments:
Post a Comment