ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి మరింతగా చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. ఓ వైపు అధిష్టానం
అసంతృప్తి మరోవైపు పార్టీలోని ప్రత్యర్థుల ఫిర్యాదులు ఆయనకు మనశ్శాంతి లేకుండా
చేస్తున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి
అన్నింటిలోనూ విఫలమయ్యారంటూ రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్
ఓ నోట్ తయారు చేసి
అధిష్టానానికి సమర్పించినట్లు చెబుతున్నారు. అధిష్టానం సూచనలను కిరణ్ కుమార్ రెడ్డి
అమలు చేయడం లేదని, అందులో
తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆజాద్ తన నోట్లో చెప్పినట్లు సమాచారం.
ప్రణాళికాబద్దంగా వ్యవహరించడంలో కూడా విఫలమయ్యారని ఆయన
అన్నట్లు సమాచారం.
పార్టీ
సమన్వయ కమిటీ సమావేశం తీర్మానాలను
కూడా కిరణ్ కుమార్ రెడ్డి
అమలు చేయడం లేదని ఆజాద్
తన నోట్లో ఫిర్యాదు
చేసినట్లు సమాచారం. ఈ నోట్ను
ఆజాద్ సోనియా గాంధీకి సమర్పించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల విషయంలో
ముఖ్యమంత్రి పూర్తి అలసత్వం ప్రదర్శించారని ఆయన ఆరోపించినట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట
వెళ్లిన 17 మంది శానససభ్యులపై వేటు
పడిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి ప్రణాళికాబద్దంగా
వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి
రాకపోయేదని ఆజాద్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప
ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలను ఢిల్లీకి పిలిపించుకుని నియోజకవర్గాలవార్గీ సమన్వయ కమిటీలు వేయాలని సూచించినా అది పూర్తిగా కార్యరూపం
దాల్చినట్లు లేదని, దానికి సంబంధించిన సమాచారం కూడా ముఖ్యమంత్రి నుంచి
లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
ఆయన ప్రత్యర్థులు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫిర్యాదు
చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలోని రాయచోటి,
రాజంపేట శాసనసభా నియోజకవర్గాలకు ఏకపక్షంగా అభ్యర్థులను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ వారు అధిష్టానానికి ఫిర్యాదు
చేసినట్లు చెబుతున్నారు. రాజంపేటకు మల్లికార్జున రెడ్డిని, రాయచోటికి రాంప్రసాద రెడ్డిని ఆయన ఎంపిక చేశారు.
రాజంపేటలో
బలిజలు ఎక్కువగా ఉన్నారని, బలిజ సామాజిక వర్గానికి
చెందిన పసుపులేటి బ్రహ్మయ్యను అభ్యర్థిగా పెట్టాలని జిల్లా నాయకులు చెప్పినా ఆయన వినలేదని అంటున్నారు.
దీంతో పసుపులేటి బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారని
వారంటున్నారు. అలాగే, రాయచోటీలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారని చెప్పినా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేశారని వారు
మండిపడుతున్నారు.
కడప జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట
నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ సామాజిక వర్గానికి
చెందిన అభ్యర్థులనే ఖరారు చేస్తే, మిగతా
సామాజిక వర్గాలు కూడా దూరమయ్యే ప్రమాదం
ఉందని చెప్పినా కిరణ్ కుమార్ రెడ్డి
వినలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి తీరు వల్ల పార్టీ
నష్టపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తూ
అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఏమైనా కిరణ్ కుమార్
రెడ్డికి రెండు వైపుల నుంచి
ప్రమాదం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది.
0 comments:
Post a Comment