అనంతపురం:
తనను దూషించడం వల్లనే మద్దెలచెర్వు సూరిని హత్య చేశానని భాను
కిరణ్ చెప్పినదానిలో వాస్తవం లేదని సూరి భార్య
గంగుల భానుమతి అన్నారు. దశాబ్దాల ఫాక్షన్ కక్షల్లో భాగంగానే సూరి హత్య జరిగిందని
ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. భాను కిరణ్ వెనక
పెద్దలున్నారని ఆమె ఆరోపించారు. భాను
కిరణ్ అరెస్టుపై ఆమె శనివారం ప్రతిస్పందించారు.
తన భర్త హత్య విషయంలో
ప్రత్యర్థి వర్గంపై తనకు అనుమానాలున్నాయని ఆమె
చెప్పారు. దీనిపై తాను ముఖ్యమంత్రిని, హోం
మంత్రిని కలుస్తానని ఆమె చెప్పారు.
మీడియా
సమావేశంలో భాను కిరణ్ నవ్వుతూ
కనిపించాడని, అతని మానసిక స్థితిపై
సందేహం కలుగుతోందని ఆమె అన్నారు. కుటుంబ
సభ్యుల కన్నా ఎక్కువగా తాము
భాను కిరణ్ను విశ్వసించామని,
ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని
ఆమె అన్నారు. తమకు అనుమానం వచ్చే
విధంగా ఏనాడు కూడా ప్రవర్తించలేదని
ఆమె అన్నారు. అతడికి డబ్బు పిచ్చి మాత్రం
ఉందని ఆమె అన్నారు. భానును
ఆలస్యంగానైనా పట్టుకున్నందుకు ఆమె సిఐడి అధికారులకు
కృతజ్ఢతలు తెలిపారు. అతడిని జీవితాంతం జైలులో ఉంచాలని ఆమె అన్నారు.
భాను
అరెస్టు విషయంలో తమకెలాంటి అనుమానాలు లేవని భానుమతి అన్నారు.
భాను లొంగిపోయే పరిస్థితి లేదని, పోలీసులే అరెస్టు చేశారని తాము భావిస్తున్నామన్నారు. తాను మొదటి
నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చానని, ఈ నేపథ్యంలోనే అరెస్టు
చేశారన్నారు. డబ్బుపిచ్చి పట్టి భానుకిరణ్ తన
భర్తను హత్య చేశాడని ఆమె
ఆరోపించారు.తన భర్త సూరి
పేరు చెప్పుకుని భాను అనేక దందాలు
చేసి కోట్లు గడించాడని, కేసుల నుంచి తన
భర్త విముక్తి పొందగానే వాటిని ఆయనకు ఇవ్వాల్సి వస్తుందనే
ఉద్దేశంతోనే అంతవరకు నమ్మకంగా వ్యవహరించిన భానుకిరణ్ తన భర్త సూరిని
హతమార్చాడని భానుమతి ఆరోపించారు. తమకు న్యాయం జరుగుతుందని
భావిస్తున్నామని గంగుల భానుమతి ఆశాభావం
వ్యక్తం చేశారు.
భానుకిరణ్ను పోలీసులు అరెస్టు
చేశారా? లేక అతనే లొంగిపోయాడా?
అనే విషయం తేలాల్సి ఉందని
మద్దెలచెరువు సూరి సోదరుడు గంగుల
సుధీర్రెడ్డి అన్నారు. భానుకిరణ్ అరెస్టు విషయం తెలుసుకున్న సుధీర్రెడ్డి పైవిధంగా స్పందించారు. అరెస్టు చేసి ఉంటే సంతోషిస్తామని,
అయితే భానుకిరణ్తో పోలీసులు కుమ్మక్కై
లొంగిపోయేలా చేసి ఉండే అవకాశాలు
కూడా లేకపోలేదని ఆయన అనుమానాలు వ్యక్తం
చేశారు. భానుకిరణ్ను విచారించి సూరి
హత్యకేసులోని కుట్రదారులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మద్దెలచెర్వు
సూరిని తానే హత్య చేసినట్లు
భాను కిరణ్ సీఐడీ పోలీసుల
విచారణలో భాను కిరణ్ అంగీకరించాడు.
తన తల్లిని, చెల్లిని సూరి తిట్టాడని, సహచరుల
ఎదుట తనను కూడా తిట్టేవాడని,
ఆర్థిక లావీదేవీల్లో ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో
నా అంతు చూస్తానని సూరి
అన్నాడని, తన ప్రాణాలు కాపాడుకోవడం
కోసమే సూరిని తుపాకితో కాల్చిచంపినట్లు భానుకిరణ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. నాలుగు నెలల ముందు నుంచే
సూరి హత్యకు వ్యూహం సిద్ధం చేసినట్లు భాను తెలిపాడు. ఒక
వేళ సూరిని తాను చంపకపోతే ఆయనే
తనను చంపేవాడని భాను చెప్పాడు.
0 comments:
Post a Comment