ఒంగోలు:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్)
అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
ఆదివారం నిప్పులు కక్కారు. పేదల భూములను లాక్కొని
తమ వర్గీయులకు కట్టబెట్టడంలో చంద్రబాబు దొంగైతే వైయస్ గజదొంగ అని
ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ రథయాత్రలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో
ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్,
తెదేపా, వైయస్సార్ కాంగ్రెసులలో రెండు వర్గాల ఆధిపత్యం
కొనసాగుతుందన్నారు. వైయస్ రాజశేఖర్రెడ్డి
సిఎంగా ఉన్నపుడు బలహీన వర్గాలకు చెందిన
వేలాది ఎకరాలను తన వర్గీయులకు దోచి
పెట్టారన్నారు. చంద్రబాబు హయాంలో వందలాది ఎకరాల పేదల భూములను
లాక్కొని సెజ్‌ల పేరుతో
తనవారికి కట్టబెట్టారని తెలిపారు. సెజ్‌ల పేరుతో
తీసుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పేద ప్రజలకు పంచాలని
ఆయన డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలో
బాక్సైట్ గనులను పెన్నా సిమెంటు అధినేత ప్రతాప రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టబెట్టడం చట్ట విరుద్ధమన్నారు. రాజ్యాంగం
ప్రకారం అటవీ ప్రాంతంలోని సంపద
అనుభవించే హక్కు గిరిజనులకు మాత్రమే
ఉందన్నారు. తన విచక్షణాధికారాలను ఉపయోగించుకొని
బాక్సైట్ భూముల లీజును గవర్నర్
రద్దు చేయాలని, లేకుంటే గిరిజనులతో కలసి ఎమ్మార్పీఎస్ పోరాటం
చేస్తుందని హెచ్చరించారు.
రాజ్యాంగ
నిర్మాత అంబేద్కర్, మహాత్మా గాంధీ, జగ్జీవన్ రామ్ విగ్రహాలున్న ప్రాంతంలో
మరొకరి విగ్రహాలకు అనుమతివ్వకూడదని, ఒక వేళ వుంటే
రద్దు చేయాలన్నారు. జాతీయ నేతల విగ్రహాల
సమీపంలో వైయస్ నిలువెత్తు విగ్రహాలు
ఏర్పాటు చేయటం వైయస్సార్ కాంగ్రెసు
దురహంకారానికి నిదర్శనమన్నారు.
కాగా
అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జూన్
5 తరువాత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు మందకృష్ణ ప్రకటించారు. పెత్తందారీ పార్టీలకు వ్యతిరేకంగా 2014 ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడతామన్నారు. అధికారంలోకి వస్తే పేదల నుంచి
లాక్కున్న భూములను తిరిగి వారికి ఇప్పిస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment