నెల్లూరు:
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు నాయకుడు టి. సుబ్బిరామిరెడ్డి సిద్ధపడుతున్నట్లు
తెలుస్తోంది. కాంగ్రెసు నుంచి నెల్లూరు స్థానం
ఎన్నికైన రాజమోహన్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ
ఏర్పడింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి రానున్న ఉప ఎన్నికల్లో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయనున్నారు.
సుబ్బిరామి
రెడ్డి ఈ నెల 29వ
తేదీన నెల్లూరుకు వస్తున్నారు. నగరంలోని కస్బూర్బా విద్యాలయ సంస్థ కోసం పది
కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ఆయన వస్తున్నారు. ఆయన
నెల్లూరుకు చెందినవారే. ఆయితే, చాలా కాలంగా విశాఖపట్నం
జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం
విశాఖపట్నం లోకసభ స్థానానికి దగ్గుబాటి
పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి
వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని
ఆయన కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నారు.
అయితే,
కాంగ్రెసు పార్టీ అధిష్టానం మరో విధంగా ఆలోచించినట్లు
తెలుస్తోంది. నెల్లూరు లోకసభ స్థానం నుంచి
సుబ్బిరామి రెడ్డిని బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి, మాజీ ముఖ్యమంత్రి నేదరుమల్లి
జనార్దన్ రెడ్డి ఈ స్థానం నుంచి
పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం
సహకరించేట్లు లేదు. దీంతో అధిష్టానం
టి. సుబ్బిరామిరెడ్డి అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు
తెలుస్తోంది.
నెల్లూరు
జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే
శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు
ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 20వ
తేదీలోగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కాంగ్రెసు నాయకులు హైదరాబాదు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. వారి సమావేశం తర్వాతనే
ఉదయగిరి స్థానానికి అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment