న్యూఢిల్లీ/
హైదరాబాద్: తెలంగాణపై తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు
చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల ఫోరం కన్వీనర్ పొన్నం
ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ బిడ్డవే అయితే పరకాల ఉప
ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని
ఆయన రేణుకా చౌదరికి సవాల్ విసిరారు. తాను
కూడా తెలంగాణ పార్లమెంటు సభ్యురాలినే అని చెప్పుకునే దౌర్భగ్య
స్థితికి రేణుకా చౌదరి దిగజారారని ఆయన
అన్నారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బ్లాక్ మెయిల్ చేసిందెవరో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తాము
ప్రజల ఆకాంక్ష మేరకే వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణ పార్లమెంటు సభ్యులపై సోనియా ఆగ్రహంగా ఉన్నారని సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్
రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. తెలంగాణ
ప్రజాప్రతినిధులందరినీ ఢిల్లీకి తీసుకు రావాలని తాము తెలంగాణ ప్రజాప్రతినిధుల
ఫోరం కన్వీనర్, మంత్రి సారయ్యకు కోరామని ఆయన చెప్పారు. తెలంగాణ
ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీకి రావాలని ఆయన కోరారు. అన్ని
పార్టీల తెలంగాణ ప్రజా ప్రతినిధులు జెండాలు,
ఎజెండాలు పక్కన పెట్టి ఢిల్లీకి
వచ్చి అన్ని పార్టీల నాయకులతో
సమావేశమైతే పరిస్థితి మారుతుందని ఆయన అన్నారు.
పొన్నం
ప్రభాకర్ చేసిన విజ్ఞప్తిపై తాము
చర్చలు జరుపుతున్నామని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. తెలంగాణ మంత్రులతో చర్చించి ప్రజాప్రతినిధులతో ఢిల్లీకి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ
మంత్రుల మధ్య ఐక్యత లేదనడం
అవాస్తవమని ఆయన చెప్పారు. తెలంగాణపై
అందరి మాటా ఒక్కటేనని ఆయన
చెప్పారు. తమకు తెలంగాణ తప్ప
మరో ఎజెండా లేదని ఆయన స్పష్టం
చేశారు.
తెలంగాణపై
ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుల వైఖరి తప్పు కాదని
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర
వెంకటరమణా రెడ్డి అన్నారు. సమస్యను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తారని
ఆయన అన్నారు. పదవులు రానంత మాత్రాన చిరంజీవిని
విమర్శించడం సరి కాదని ఆయన
అన్నారు. తెలంగాణపై సభా కార్యక్రమాలను అడ్డుకున్న
ఎనిమిది మంది కాంగ్రెసు పార్లమెంటు
సభ్యులు నాలుగు రోజుల పాటు లోకసభ
నుంచి సస్పెండ్ అయ్యారు. సోమవారం పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు.
0 comments:
Post a Comment