హైదరాబాద్:
తమ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
చేసిన వ్యాఖ్యలపై ప్రాథమిక విద్యామంత్రి శైలజానాథ్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు పుట్టడమే నెగిటివ్ ఆలోచనలతో పుట్టారని ఆయన శనివారం మీడియా
ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ ఏ విధమైన గందరగోళంలో
లేదని ఆయన అన్నారు. ఉప
ఎన్నికల అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
వ్యక్తిగత
పనుల మీదనే తాను చైనాకు
వెళ్లాలని శైలజానాథ్ స్పష్టం చేశారు. అధికారిక వీసాపైనే పర్యటనకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. విదేశాలకు
వెళ్లే ముందు భారత ప్రభుత్వ
అనుమతి తీసుకోలేదని వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు.
అనంతపురం కాంగ్రెసు అభ్యర్థి ఎంపికపై ఏ విధమైన విభేదాలూ
లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు
ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న ఆదరణ
తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన అన్నారు. మే
మొదటివారంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పిసిసి
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య ఏ విధమైన
విభేదాలు లేవని మంత్రి ఏరాసు
ప్రతాప రెడ్డి అన్నారు. కొన్ని స్థానాల్లో పోటీ విషయంపై వీరిద్దరి
మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని ఆయన
మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం
చేశారు. కాంగ్రెసు సంక్షేమ పథకాలు, కిరణ్ కుమార్ రెడ్డి
పారదర్శక పాలన అభ్యర్థులను గెలిపిస్తాయని
ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్ కేటాయించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment