హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత
తనది కుక్క బతుకే అయిందని
భాను కిరణ్ అన్నాడు. భాను
కిరణ్ను సిఐడి అధికారులు
శనివారం విచారించారు. అస్వస్థత కారణంగా శుక్రవారం భానును విచారించడం కుదరలేదు. శనివారంనాటి విచారణలో భాను కిరణ్ సిఐడి
అధికారుల ముందు పలు ఆసక్తికరమైన
విషయాలను వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. సూరి హత్యకు ముందు
అమ్మాయిలతో మజా చేశానని ఆయన
చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పబ్లు, క్లబ్లు తిరిగేవాడినని అతను
చెప్పాడు.
సూరిని
హత్య చేసిన తర్వాత కల్లు
కాంపౌండ్లే వైన్ షాపులు అయ్యాయని,
ఆర్టీసి బస్సులే లగ్జరీ కార్లు అయ్యాయని భాను కిరణ్ చెప్పినట్లు
సమాచారం. తాను అప్పట్లో బ్లూ
లేబుల్ మద్యం సేవించేవాడినని, తర్వాత
నాటు సారా తాగాల్సి వచ్చిందని
అతను చెప్పాడు. తాను భూములకు సంబంధించి
34 సెటిల్మెంట్లు చేసినట్లు అతను అంగీకరించాడు. భాను
కిరణ్కు సంబంధించిన 25 వివాదాస్పద
సెటిల్మెంట్ల డాక్యుమెంట్లను సిఐడి స్వాధీనం చేసుకుంది.
9 డాక్యుమెంట్లు బెదిరించి రాయించుకున్నవి. వందల ఎకరాల భూమిని
భాను బినామీల పేరు మీద కొనుగోలు
చేసినట్లు భాను వెల్లడించాడు.
సూరి
హత్యతో పరిటాల రవి వర్గానికి సంబంధం
లేదని భాను చెప్పాడు. తాను
బతకడం కోసం సూరిని హత్య
చేశానని, సూరిని హత్య చేస్తే తనకు
ముప్పు ఉంటుందని తెలుసునని అతను చెప్పాడు. సూరికి
తెలియకుండా చేసిన సెటిల్మెంట్లే తన
ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టాయని అతను అన్నాడు. సూరి
హత్యకు ముందు తన కుటుంబాన్ని
అజ్ఞాతంలోకి పంపించానని, సూరి అనుచరులు ముప్పు
తలపెడతారని అలా చేశానని అతను
చెప్పాడు. అయితే సూరి అనుచరులు
తన కుటుంబానికి ఏ విధమైన హాని
చేయలేదని అతను చెప్పాడు. అరెస్టు
కన్నా ముందు పాండిచ్చేరిలోని రెండు
లాడ్జీల్లో ఉన్నట్లు అతను తెలిపాడు.
సూరి
హత్య తర్వాత ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు
తిరిగినట్లు అతను చెప్పాడు. పోలీసుల
నుంచి తప్పించుకోవడానికి తాను ఏలాంటి వేషాలు
వేయలేదని చెప్పాడు. సిఐడి పోలీసులు ఊహించని
రీతిలో తనను పట్టుకున్నారని, ఓ
వ్యాపారవేత్త నుంచి లక్ష రూపాయల
డబ్బులు తీసుకోవడానికి వస్తున్నప్పుడు జహీరాబాద్లో పట్టుకున్నారని అతను
చెప్పాడు. తాము వ్యాపారవేత్తను అనుసరించి
వెళ్లి భానును పట్టుకున్నట్లు సిఐడి అధికారులు చెప్పారు.
తాను 15 నెలల పాటు 4 లక్షల
70 వేల రూపాయలతో కాలం గడిపినట్లు అతను
తెలిపాడు.
భాను
కిరణ్, మంగలి కృష్ణ కలిసి
పనిచేశారని, ఎక్కువ సెటిల్మెంట్లు మంగలి కృష్ణతో కలిసి
చేశాడని సిఐడి అధికారులు చెప్పారు.
భూదందాల కోసం భాను కిరణ్
వాడిన ఐదు ఆయుధాల్లో మూడు
మంగలి కృష్ణ ఇచ్చాడని, మిగతా
రెండు సొంతంగా సమకూర్చున్నాడని వారు తెలిపారు. భాను
కిరణ్ 50 కోట్ల రూపాయల మేర
లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న
డాక్యుమెంట్లలో సూరి, భాను పేర్ల
మీద ఉన్నాయని, కొన్ని భాను పేరు మీద
ఉన్నాయని సిఐడి అధికారులు చెప్పారు.
భాను
కిరణ్కు సహకరించినవారిని విచారిస్తామని,
అవసరమైతే అరెస్టు చేస్తామని సిఐడి అధికారులు చెప్పారు.
రేపు భాను కిరణ్ను
క్షేత్ర స్థాయిలో విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ తీసుకుని వెళ్తున్నట్లు వారు తెలిపారు. కార్పొరేట్
సంస్థల వివాదాల్లో తలదూర్చి కొన్ని కంపెనీలను భాను స్వాధీనం చేసుకున్నాడని
వారు తెలిపారు. సినీ తారలతో సహవాసం
చేశాడని చెప్పారు.
0 comments:
Post a Comment