హైదరాబాద్:
ఇటీవల ఉప ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో పార్టీ
అభ్యర్థి ఓటమికి తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ను బాధ్యుడ్ని చేసేందుకు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సిద్ధపడుతున్నారు. మహబూబ్నగర్లో ఓటమిపై
సోమవారం తెరాస పోలిట్బ్యూరో
సమావేశంలో వేడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మహబూబ్నగర్లో తెలంగాణ
జెఎసి సహకరించలేదని, కోదండరామ్ స్తబ్దుగా వ్యవహరించారని తెరాస నాయకులు సమావేశంలో
విమర్శించినట్లు తెలుస్తోంది.
బిజెపి
కూడా పోటీలో ఉండడంతో తెలంగాణ జెఎసి తెరాసకు స్పష్టంగా
మద్దతు ప్రకటించలేకపోయింది. బిజెపి కూడా జెఎసిలో ఉండడం,
తెలంగాణ అనుకూలంగా స్పష్టమైన వైఖరి తీసుకోవడం తెలంగాణ
జెఎసిని ఇరకాటంలో పెట్టింది. దాంతో జెఎసి ఏ
పార్టీకి కూడా మద్దతు ప్రకటించలేదు.
జిల్లా జెఎసి మాత్రం బిజెపి
అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డికి సహకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్లనే బిజెపి అభ్యర్థి విజయం సాధించినట్లు భావిస్తున్నారు.
తెరాస అభ్యర్థి మైనారిటీ కావడంతో కెసిఆర్పై తీవ్రమైన విమర్శలు
వచ్చాయి.
తెరాస
అధ్యక్షుడు కెసిఆర్ బిజెపితో కుమ్కక్కయ్యారని, మైనారిటీ కాబట్టే ఓడించారని దళిత, మైనారిటీ నాయకులు
విమర్శిస్తున్నారు. ఇది కెసిఆర్ను
చిక్కుల్లో పడేసింది. దీన్ని అధిగమించడానికి పోలిట్బ్యూరో సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పార్టీపరంగా కూడా కొంత మంది
నష్టం చేశారని తెరాస నాయకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీపరంగా ఎవరు నష్టం చేశారో
తెలుసునని, బాధ్యులను వదిలి పెట్టేది లేదని
కెసిఆర్ పోలిట్బ్యూరో సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దానిపై
చర్చించడం సరి కాదని ఆయన
సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో
కీలక నేతలతో సమావేశం నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు సమాచారం.
మహబూబ్నగర్లో బిజెపి,
తెరాస మధ్య నెలకొన్న విభేదాలు
కోదండరామ్ను ఇరకాటంలో పెట్టే
పరిస్థితి ఉంది. జెఎసి నుంచి
తప్పుకోకుండానే బిజెపి స్వతంత్రంగా వ్యవహరించేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది. పరకాలలో కూడా పోటీ చేసేందుకు
బిజెపి సిద్ధపడుతోంది. తాము పోటీ చేస్తామని
తెరాస ప్రకటించింది. ఈ స్థానం విషయంలో
జెఎసి ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు
ఆసక్తికరంగా మారింది.
0 comments:
Post a Comment