హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ-2గా ఉన్న
విజయ సాయి రెడ్డిని అరెస్ట్
చేసినప్పుడు, ఎ-1 ముద్దాయిగా ఉన్న
జగన్ను ఎందుకు అరెస్టు
చేయడం లేదని తెలుగుదేశం పార్టీ
నేత వర్ల రామయ్య ఆదివారం
ప్రభుత్వాన్ని నిలదీశారు. పలువురు మరణం వెనుక వైయస్
జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. చేసేవన్నీ
చేసి ఇప్పుడు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
జగన్ది ఓ క్రిమినల్
బ్రెయిన్ అని, కక్షతో రగిలే
హృదయమని, ఒక్క మాటలో చెప్పాలంటే
అతనో గ్యాంగ్స్టర్ అన్నారు. జగన్
దందాలన్నీ కెవిపి రామచంద్ర రావుకు తెలిసినప్పటికీ ఆయన్ను నోరు విప్పమని కాంగ్రెస్
ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
జగన్ అవినీతి తెలిసిన కెవిపిని ఎందుకు విచారించడం లేదని సిబిఐని ప్రశ్నించారు.
భూ ఆక్రమణ కేసులో జగన్ మేనమామ రవీంద్రనాథ్
రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు.
జగన్
కుటుంబసభ్యులు, బంధువుల పేర్లపై రిజిస్టరైన ఆస్తులన్నింటిపైనా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్టర్ మస్తాన్ రావు ఆత్మహత్య వ్యవహారంపై
పునర్విచారణ జరపాలన్నారు. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల జరిగిన భూముల దందాలు హోంమంత్రికి
తెలుసని వర్ల వ్యాఖ్యానించారు. తండ్రి
అధికార అండతో లక్ష కోట్లు
కొల్లగొట్టిన జగన్ను అరెస్ట్
చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతున్నాయని మరో నేత గాలి
ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు.
ఓఎంసి
ఎమ్మార్, అక్రమాస్తుల కేసుల్లో చార్జిషీట్ల దాఖలుకు ముందే పలువురు ఐఏఎస్
అధికారులను, ఇతరులను అరెస్ట్ చేసిన సిబిఐ అన్ని
కేసుల్లోనూ నిందితుడైన జగన్ను ఎందుకు
అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. భూములు, గనుల కేటాయింపుల్లో అక్రమాలు
జరిగాయని కాగ్, సిబిఐ, హైకోర్టు
వెల్లడించినప్పటికీ ఎందుకు రద్దు చేయడంలేదని ముద్దుకృష్ణమ
ప్రశ్నించారు.
జగన్
అవినీతితోపాటు, కుంభకోణాల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వాటాలు ఉండటం వల్లే చర్యలు
తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని మండిపడ్డారు. రానున్న ఉప ఎన్నికల్లో ఐదు
స్థానాల్లో పార్టీని గెలిపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న చిరంజీవి ముందుగా తన సొంత స్థానాలైన
తిరుపతి, నర్సాపురంలో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని సవాల్
విసిరారు. అవినీతిపరులని తెలిసి కూడా లాలూ, కరుణానిధితో
కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకున్న విషయం కూడా చిరంజీవికి
తెలియకపోవడం అతని అఙ్ఞానానికి నిదర్శనమని
పేర్కొన్నారు.
0 comments:
Post a Comment