వైఎస్ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు
జగన్మోహన రెడ్డి అరెస్టు అనూహ్యం కాకపోగా అనివార్యమైన పరిణామం. దీన్ని నివారించడానికి రాజకీయంగానూ న్యాయ పరంగానూ చేయగలిగిన
వాదనలు ప్రయత్నాలన్ని వారు చేశారని గుర్తుంచుకోవాలి.ఇప్పటికే దీనిపై చాలా చర్చలు జరిగిన
దృష్ట్యా కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొంటున్నాను.
1.సోనియాకు
అనుకూలంగా వుంటే ఈ కేసు
పెట్టేవారా అన్న ప్రశ్న వాస్తవంగా
సమస్యను ఆ ఉభయులకు మాత్రమే
పరిమితం చేస్తున్నది. సోనియా కోరుకోకపోయినా మన్మోహన్ సింగ్ సహకరించకపోయినా 2జి స్పెక్ట్రం వంటి
అవినీతి వ్యవహారాలు దర్యాప్తునకు వచ్చాయి.కనక ఇది రెండు
కాంగ్రెస్లకు మాత్రమే సంబంధించినది
కాదు.పైగా సోనియా గనక
పదవిఇచ్చేందుకు సిద్ధపడి వుంటే వీరు కూడా
సర్దుకుని వుండేవారు.
2.అయితే
కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా స్పష్టం.ఎ1గా వున్న జగన్ను ఇంత కాలం
ఎందుకు అరెస్టు చేయలేదు? అన్న ప్రశ్న వారితో
సహా అందరూ అడుగుతున్నారు. సిబిఐ
కోర్టు కూడా అడిగింది. అలాగే
సిబిఐ దర్యాప్తు ఆయనకే పరిమితం చేసి
అందుకు బాట వేసిన మంత్రులను
వదిలేస్తే ఎలా అన్నది మరో
పెద్ద ప్రశ్న. ఈ విషయంలో ముఖ్యమంత్రి
కిరణ్, పిసిసి అద్యక్షుడు బొత్స కూడా తమ
రాజకీయ పాలనా బాధ్యత లేదన్నట్టు
మాట్లాడ్డం చెల్లుబాటయ్యేది కాదు. ఈ తప్పుకు
బాధ్యత అవిభాజ్యమైంది.అనుభోక్త జగన్ అయితే కావచ్చు
గాని తక్కిన వారు అమాయకులు కాదు.
ఇదే సమయంలో లిక్కర్ సిండికేట్లపై ఎసిబి దాడుల పట్ల
వ్యవహరించిన తీరు పూర్తి భిన్నంగా
కనిపిస్తూనే వుంది.
3.తెలుగు
దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయొద్దని కేసులు వేయొద్దని
ఎవరూ
చెప్పరు. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టులో
అలాటి పిటిషన్ వుంది. కాని కాంగ్రెస్, తెలుగు
దేశంలను విమర్శించినంత మాత్రాన జగన్పై ఆరోపణలు
ఎలా మాసిపోతాయన్నది ప్రశ్న
4.కాంగ్రెస్కు రాజకీయం వున్న
మాట నిజమే. కాని జగన్ పార్టీకి
కూడా రాజకీయం వుంది కదా? రాజకీయంగా
సమర్థించుకోవచ్చు గాని అన్ని అభియోగాలు
కేవలం కక్ష సాధింపు అన్న
ఒక్క మాటతో కొట్టేస్తే సరిపోతుందా?
వ్యాన్పిక్, ఫార్మాసిటీ వగైరాలన్ని కళ్లముందు కనిపిస్తున్న నిజాలు కదా?
5.సిబిఐ
కేంద్ర హొం శాఖ ఆధ్వర్యంలో
పనిచేస్తుందనేది ఎప్పుడైనా వుంది. అయితే ఇక్కడ దానికి
ఫైలు అప్పగించింది ఉన్నత న్యాయస్థానమన్నది కూడా
గుర్తుంచుకోవాలి. ఈ క్షణం వరకూ
ప్రతి విషయంలో వారు కోర్టును ఆశ్రయిస్తూనే
వున్నారు.
6.నా
బిడ్డ చేసిన తప్పేమిటి అంటున్న
విజయమ్మ ఇన్ని అభియోగ పత్రాలను
కూడా పట్టించుకోవడం లేదా?. అనేక ప్రాథమిక ఆధారాలు
కనిపిస్తుండగా గజం మిథ్య పలాయనం
మిథ్య అంటే సరిపోదు. పైగా
పెట్టుబడులు రాలేదని జగన్ ఇంత వరకూ
చెప్పలేదు. విదేశాల నుంచి వచ్చిన వాటిలో
అనేక అపసవ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగ ప్రవేశం మరింత
తీవ్రమైన విషయం. సరళీకరణ విధానాల వల్ల కలగిన విశృంఖల
పోకడలకు ఒక పెద్ద ఉదాహరణ
జగన్ వ్యవహారమైతే దాంట్లో అతి కీలకమైన భాగం
విదేశాల ద్వారా నిధులు వచ్చిన తీరు.దీనిపై గనక
ఇడి కేంద్రీకరిస్తే దిగ్బంధం మరింత తీవ్రమవుతుంది.
7. జగన్కు జనం మద్దతు
వుందని, రేపు ఉప ఎన్నికలలో
కూడా విజయం సాధిస్తారని అంచనాలు
వున్నాయి. అలాగే జరగొచ్చు కూడా.
అయితే దానికి దర్యాప్తులు విచారణలకు ఏ మాత్రం సంబంధం
లేదు. ఆయన అరెస్టు తర్వాత
పరిణామాలపై అభద్రత సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా
అవేవీ నిజం కాలేదు.ప్రజలు
సంయమనం పాటించారు. ఇది మంచి పరిణామం.
దేశంలో జయలలిత,లాలూ యాదవ్, యెడ్యూరప్ప
వంటి ముఖ్యమంత్రులతో సహా ఎందరో కీలక
నేతలను ఎన్నికల్లో గెలిచినా అరెస్టు చేశారు. ఈ కేసులోనూ ఇప్పటికీ
నలుగురు అరెస్టయ్యారు.అప్పుడంతా లేని తప్పు ఇప్పుడేం
వచ్చింది? వాటిపై కోర్టులో పోరాడిన వారు ఇప్పుడు మరో
విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఒక పార్టీ అద్యక్షుడికి
ప్రత్యేక అధికారాలేమీ సంక్రమించవు. ఎన్నికల ప్రచారం చేసుకోవడం అనేది వారి స్వంత
అవసరం తప్ప దేశం అవసరం
కాదు. మానవీయ కోణాలైన అనారోగ్యం, మరణం వంటి కారణాల
వల్లనే మినహాయింపునకు అవకాశం వుంటుంది తప్ప ఎన్నికల ప్రచారానికి
వ్యాపారావసరాలకు కోర్టులు మినహాయింపు నివ్వడం జరగదు. ఇప్పుడు రెండవ కేసు కూడా
మొదలు కాబోతుందని గనక, ఇడి వేచి
చూస్తున్నది గనక ఈ వ్యవహారం
దీర్ఘకాలమే పట్టొచ్చు.
8.విజయమ్మ
ధర్నాతో మొదలు పెట్టి వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల
ప్రచారానికి కేంద్ర బిందువు కాబోతున్నారు గనక సానుభూతి వ్యూహం
మరింత ఉధృతం కావచ్చు. ఇతర
కుటుంబ సభ్యులు కూడా ఆ బాటలోనే
వున్నారు. అయితే సానుభూతి ఒక్కసారి
వ్యవహారం తప్ప శాశ్వతం కాదని
గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్కు, రాజీవ్ గాంధీకి
వారి వారి సానుభూతులు 1984-85లో
అచ్చి వచ్చినా 1989లో కనిపించనేలేదు.కనక
ఉప ఎన్నికల వరకే సానుభూతి పనిచేస్తుందని
ఆపైన వాస్తవంగా ఆ పార్టీ తీరును
బట్టి జనం స్పందిస్తారని చెప్పొచ్చు.
9.కాంగ్రెస్,
తెలుగు దేశంల నుంచి వలసల
విషయానికి వస్తే ఉప ఎన్నికల
ఫలితాల తర్వాత దాన్ని అంచనా వేయాల్సి వుంటుంది.అయితే ప్రభుత్వం కొనసాగుతుంటే
మాత్రం సామూహికంగా వెళ్లిపోవడం జరక్కపోవచ్చు. ఇప్పటికి ప్రతిపక్షంగా వున్న తెలుగు దేశం
గురించి చూస్తే వైఎస్ఆర్సిపి
ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటున్నదని భావించి భవిష్యత్తు ముడివేసుకునే వారు వెళ్లవచ్చు.
10.జగన్
అరెస్టుతో విచారణ పర్వం మొదలైంది. ఇక
మిగిలిన సంగతి కోర్టులకు వదిలేసి
విధానపరమైన అంశాలపై దృష్టి సారించడం మంచిది. ఎవరు కారకులైనా ఈ
వ్యవహారాలలో రైతుల నుంచి లాక్కొన్న
నామకార్థపు ధరకు కొనుక్కున్న భూమిని
వారికే అప్పగించడం తక్షణం జరగాలి. అనుమానాస్పద అవినీతిభరిత ప్రాజెక్టులన్నిటినీ నిలిపేయాలి.అది అన్నిటికన్నా కీలకం.
0 comments:
Post a Comment