మెహతా
సోదరుల్లో ఒకరైన మాయాంక్ మెహతాతో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంబంధాలు
బయటపడ్డాయి. జగన్ హవాలాకు మాయాంక్
మెహతా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి జగన్ అరెస్టు సందర్భంగా
న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసిన
రిమాండ్ రిపోర్టులో వివరాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లగ్జెంబర్గ్లో నమోదు చేసిన
ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సికార్
యాజమాన్యం గుట్టును సిబిఐ విప్పినట్లు చెబుతున్నారు.
దీనికి వైయస్ జగన్, వైయస్
రాజశేఖర రెడ్డి యాజమానులని తేలినట్లు సమాచారం.
ఏషియా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సికార్కు మారిషస్కు
చెందిన రెండు సంస్థల్లో వాటాలున్నాయి.
ఈ వాటాలకు సంబంధించిన రూ. 124 కోట్ల నిధులను ఆరేళ్ల
క్రితం జగన్కు చెందిన
సండూర్ పవర్లోకి పెట్టుబడులుగా
తీసుకొచ్చారని సిబిఐ తెలిపింది. ఈ
వ్యవహారంలో మయాంక్ మెహతా పాత్ర ఉన్నట్లు
సిబిఐ అనుమానిస్తోంది. ఈ విషయంపై గురువారం
వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి సింగపూర్లోని ఓ బ్యాంకు
ఖాతా నుంచి డబ్బులు మళ్లినట్లు
తేలింది. మెహతా సోదరుల్లో ఒకరైన
మయాంక్ మెహతా ఆ ఖాతాను
నిర్వహిస్తున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. సింగపూర్లోని మయాంక్ ఖాతా
నుంచి ఆర్థిక అక్రమార్కులకు స్వర్గధామమైన లగ్జెంబర్గ్లోని వైట్హాల్
అసోసియేట్స్కు డబ్బు బదిలీ
అయ్యింది. మయాంక్ మెహతా పేరును జగన్
కేసు రిమాండ్ రిపోర్ట్లోనే సిబిఐ ప్రస్తావించింది.
మెహతా
సోదరులతో జగన్కు తన
తండ్రి ముఖ్యమంత్రి కాకమునుపు నుంచే సంబంధాలున్నాయంటూ ఓ
పత్రికలో వార్తాకథనం అచ్చయింది. ఆ వార్తాకథనం ప్రకారం
- మన రాష్ట్రానికి చెందిన ఒక పారిశ్రామిక గ్రూప్
మెహతా కుటుంబాన్ని వైయస్ ఫ్యామిలీకి పరిచయం చేసింది. మెహతాలకు చెందిన 'ఛే ఇన్వెస్ట్మెంట్స్'
2004 ఎన్నికల ముందు జగన్కు
2 కోట్ల రూపాయలను ఎలాంటి పూచీకత్తు లేకుండా (అన్సెక్యూర్డ్) రుణంగా
ఇచ్చింది. అప్పట్లో కష్టాల్లో, తీవ్ర నష్టాల్లో ఉన్న
ఆయనకు రూ.2 కోట్లు పూచీకత్తు
లేకుండా ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. వైయస్
సీఎం అయిన వెంటనే సండూర్
పవర్ను దిలీప్ మెహతా
మరోమారు ఆదుకున్నారు.
రూ.4
కోట్లను ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ కింద సమకూర్చారు. అలా
కుదిరిన బంధమే ఆ తర్వాత
బాగా ముదిరి విదేశీ మార్గాల్లో హవాలా సొమ్ము రప్పించుకునే
స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సండూర్ పవర్లో రూ.125
కోట్లు పెట్టిన మారిషస్ కంపెనీలు 2ఐ క్యాపిటల్, ప్లూరీ
ఎమర్జింగ్ కంపెనీలు సాధారణ కంపెనీలుగా కాకుండా, ప్రొటెక్టెడ్ సెల్ కంపెనీలు (పీసీసీ)గా పుట్టడంతో సీబీఐ
అనుమానం రెట్టింపు అయిందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
భారత్లో జగన్ను
ఆదుకుంటున్న దిలీప్ మెహతా కుటుంబమే, హవాలా
లావాదేవీల్లో జగన్కు సహకరించినట్లు
స్పష్టమైంది. ఇదే విషయంలో సీబీఐ
దిలీప్ మెహతాను ప్రశ్నించిందని వార్తాపత్రికలు రాశాయి.
2006 ఏప్రిల్
4న ఏర్పడిన ఈ కంపెనీ అసలు
యజమానులు వైఎస్, జగన్లే అన్నది
సిబిఐ అనుమానమని వార్తలు వచ్చాయి. దీని ప్రమోటర్లలో మయాంక్
మెహతా ఉన్నట్లు స్పష్టం కావడంతో ఈ అనుమానం మరింత
బలపడుతోంది. 2ఐ క్యాపిటల్, ప్లూరీ
ఎమర్జింగ్ కంపెనీల నుంచి వాటాను జగన్
వెనక్కి కొనుగోలు చేసిన తర్వాత.. అంటే
గత ఏడాది జూన్ 3న
ఏసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను
మూసేయాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒక్కో షేర్ వెయ్యి
డాలర్లతో ప్రారంభమైన ఈ కంపెనీలో వైట్హాల్, వెల్మేడ్లకు సమాన వాటా
ఉంది. కేవలం అయిదేళ్లలో రూ.కోటి కంపెనీ 1100 కోట్లకు
ఎలా ఎదిగిందన్నదే అసలు ప్రశ్న అంటూ
ఓ దినపత్రిక వ్యాఖ్యానించింది. ఏసియా ఇన్ఫ్రా
ఇంకా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు
పెట్టిందా? ఇంకా ఎవరైనా ఇన్వెస్టర్లు
ఉన్నారా? అనే సమాచారం రాబట్టడానికి
సిబిఐ ప్రయత్నిస్తోంది.
0 comments:
Post a Comment