హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీలోకి రాకుండా హీరో రాజశేఖర్, జీవిత
దంపతులకు నందమూరి హీరో బాలకృష్ణ అడ్డుపడినట్లు
ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి రాజశేఖర్, జీవిత పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబునాయుడిని కలిశారు. చంద్రబాబు వారిని చేర్చుకోవడానికి సుముఖంగానే ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, వారిద్దరిని చేర్చుకోవద్దని బాలకృష్ణ తన బావ నారా
చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చారని ఓ
ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో వార్తాకథనం
ప్రసారమైంది.
తెలుగుదేశం
పార్టీ వ్యవహారాల్లో బాలకృష్ణ ఈ మధ్య కాలంలో
ఎక్కువగా తలదూరుస్తున్నారని అంటున్నారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి
రావడానికి నిర్ణయించుకున్న ఆయన చంద్రబాబు నిర్ణయాలను
కూడా ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో
మాట్లాడిన వల్లభనేని వంశీకి ఆగమేఘాల మీద షోకాజ్ నోటీసు
జారీ చేయడం వెనక కూడా
బాలకృష్ణ హస్తం ఉన్నట్లు వార్తలు
వచ్చాయి. అంతకు ముందు నుంచే
ఆయన పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అంతకు
ముందు బాలకృష్ణ పార్టీ వ్యవహారాల గురించి చంద్రబాబుతో ఎక్కువగా మాట్లాడకపోయేవారని అంటారు. నందమూరి హరికృష్ణతోనే చంద్రబాబు ఎక్కువగా పార్టీ వ్యవహారాలను పంచుకునేవారని చెబుతారు. హరికృష్ణతో దూరం పెరగడంతో బాలకృష్ణతో
చంద్రబాబు చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ స్థితిలోనే బాలయ్య
పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో తగిన స్థానం కోసం
చాలా మంది బాలకృష్ణను సంప్రదిస్తున్నట్లు
కూడా చెబుతున్నారు.
అనంతపురం
శాసనసభ సీటు మహాలక్ష్మి శ్రీనివాస్కు దక్కడం వెనక
కూడా బాలకృష్ణ హస్తం ఉందని అంటున్నారు.
నిజానికి, చంద్రబాబు ప్రభాకర చౌదరి పేరును ఖరారు
చేయాలని అనుకున్నారని, అయితే బాలకృష్ణ జోక్యం
చేసుకుని శ్రీనివాస్కు ఇప్పించారని అంటున్నారు.
అలాగే, ఖమ్మం జిల్లా కొత్తగూడెం
పార్టీ ఇంచార్జీ విషయంలోనూ బాలకృష్ణ జోక్యం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కోనేరు చిన్ని పేరును బాలకృష్ణ సూచించారని చెబుతారు. ఇది తెలిసిన కొత్తగూడెం
నాయకులు అభ్యంతరపెట్టారని, స్థానికంగా ఉండే నాయకులను కాదని
హైదరాబాదులో ఉండేవారని నియమించడం సరి కాదని వారు
చెప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు దాన్ని
పెండింగులో పెట్టారని వార్తలు వచ్చాయి.
కాగా,
బాలకృష్ణ 2014లో జరిగే ఎన్నికల్లో
శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు
తెలుస్తోంది. తాను పోటీ చేస్తానని,
అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది
పార్టీ నిర్ణయిస్తుందని బాలకృష్ణ ఒకటి రెండు సార్లు
చెప్పారు. అయితే, ఆయన తన స్థానాన్ని
కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ
చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలో
బాలకృష్ణ రూపంలో రెండో పవర్ సెంటర్
తయారవుతోందనే చర్చ సాగుతోంది.
0 comments:
Post a Comment