న్యూఢిల్లీ:
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, రాజకీయ నాయకులు మాత్రమే కోరుతున్నారన్న రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై
కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు దుమ్మెత్తిపోశారు. గత మూడేళ్లుగా నోరు
మెదపని కెవిపి రాజ్యసభలో తెలంగాణను వ్యతిరేకిస్తూ ప్రసంగించటాన్ని వారు తప్పు పట్టారు.
బుధవారం ఎంపీ వివేక్ నివాసంలో
వారు మీడియాతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి
ప్రతి ఒక్కరికీ తెలుసునని, కేవలం కళ్లుండీ చూడలేని,
చెవులుండీ వినలేని వాళ్లు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు.
గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు
తెలంగాణ వాదాన్ని గెలిపించారని ఆయన చెప్పారు. తెలంగాణ
ప్రజల మనసుల్ని గాయపర్చేలా, వారిని రెచ్చగొట్టేలా ఈ ప్రకటనలు ఉన్నారని
ఆయన అన్నారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యం
తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు.
వైయస్ హయాంలో అన్ని సలహాలూ కేవీపీవేనని,
అలాంటప్పుడు అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా వైఎస్ చేసిన ప్రకటన సంగతి
ఏమిటని మంద జగన్నాథం ప్రశ్నించారు.
1953లో
తెలంగాణ ఎంపీలు కూడా విలీనానికి ఒప్పుకున్నారన్న
కేవీపీ ప్రకటనపై వివేక్ స్పందించారు. ప్రజల ఒత్తిడితో ఆ
ఎంపీలంతా తమ ప్రకటనను వెనక్కి
తీసుకున్నారని, తర్వాత పార్లమెంటులో కూడా తెలంగాణపై వారు
మాట్లాడారని వివరించారు. కేవీపీ సలహాదారుగా ఉన్నప్పుడు తెలంగాణకు నిధులు తక్కువగా కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో సీమాంధ్రలోని
అన్ని స్థానాల్లో పార్టీని గెలిపిస్తే బాగుంటుందని, తెలంగాణ విషయం తమకు వదిలేయాలని
సూచించారు.
రాజ్యసభలో
చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్సహా అన్ని పార్టీలూ
తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమస్యకు పరిష్కారం కోరకుండా, సమ స్య అనైతికమని,
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని కేవీపీ మాట్లాడటం తగదన్నారు. రాజ్యసభలోని తెలంగాణ ఎంపీలు ఈ అంశాన్ని అధిష్ఠానం
దృష్టికి తీసుకెళ్లారనీ, త్వరలో తాము కూడా తీసుకెళతామని
చెప్పారు.
0 comments:
Post a Comment