హైదరాబాద్:
అరెస్టుకు తాను భయపడబోనని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
అన్నారు. రెండో రోజు సిబిఐ
విచారణకు బయలుదేరే ముందు ఆయన మీడియాతోనూ,
ప్రత్యేకంగా ఎన్డీటివితోనూ మాట్లాడారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిళ్ళ
మేరకే తనపై సీబీఐ విచారణ
జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో
మూడో రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా చేసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు.
కాంగ్రెసు
ప్రభుత్వం రాష్ట్రంలో పడిపోదని, కాంగ్రెసు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
రక్షిస్తున్నారని ఆయన అన్నారు. తన
పార్టీని నాశనం చేసేందుకు చంద్రబాబు
ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని అన్నారు. చంద్రబాబు మద్దతు ఉన్నంత కాలం ప్రభుత్వం పడిపోదని
ఆయన అన్నారు. తమ పార్టీలో చేరేందుకు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు ముందుకు వస్తున్నారని అయితే ఎవరిని పడితే
వారిని పార్టీలోకి తీసుకోబోమని ఆయన అన్నారు.
రాష్ట్రంలో
రెండు పార్టీలు మాత్రమే ఉంటాయని, వాటిలో తమ పార్టీ ఒక్కటని,
అందుకే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి తమ పార్టీని లేకుండా
చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కుట్రలో
భాగంగానే తనను సిబిఐ విచారిస్తోందని
ఆయన అన్నారు. గత తొమ్మిది నెలల
పాటు మౌనంగా ఉన్న సిబిఐ ఇప్పుడు
తనను విచారణకు పిలిచిందని, ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని
అడ్డుకోవడానికే ఇలా చేసిందని ఆయన
అన్నారు.
సిబిఐ
తనను అరెస్టు చేసిన తర్వాత అల్లర్లు
సృష్టించి ఉప ఎన్నికలను వాయిదా
వేయించేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేశాయని ఆయన
అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో మంచి నాయకులు ఉన్నారని,
చాలా మంది తన పార్టీలోకి
రావడానికి సిద్ధంగా ఉన్నారని, తాను ప్రతిభను చూసి
పార్టీలోకి తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. వైయస్
జగన్ లోటస్పాండులోని ఇంటి
నుంచి సిబిఐ విచారణకు దిల్కుషా అతిథిగృహానికి చేరుకునే
మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు
చేశారు.
0 comments:
Post a Comment