హైదరాబాద్:
రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి చెక్ చెప్పేందుకే ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి హీరో జీవిత రాజశేఖర్
దంపతులను కాంగ్రెసు పార్టీలోకి తీసుకు వచ్చారా అంటే అవుననే అంటున్నారు.
పార్టీ సీనియర్ నేత టి.సుబ్బిరామి
రెడ్డి చిరు, రాజశేఖర్ల
మధ్య మధ్యవర్తిత్వం నెరిపి, చిరును ఒప్పించి కాంగ్రెసు పార్టీలోకి తీసుకు వచ్చినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే
రాజశేఖర్ దంపతులకు చిరు గ్రీన్ సిగ్నల్
ఇవ్వక పోయి ఉంటారనే అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్లో రోజు రోజుకూ
పలుకుబడి పెంచుకుంటున్న చిరంజీవి దూకుడుకు బ్రేకులు వేసేందుకే ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే రాజశేఖర్, జీవితలను తెరపైకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. చిరంజీవి, రాజశేఖర్ల మధ్య పచ్చగడ్డి
వేస్తే భగ్గుమనే విషయం తెలిసిందే. అలాంటి
వారి ద్వారా చిరును అడ్డుకోవాలని కిరణ్ భావించారని అంటున్నారు.
రాష్ట్రంలో తనకు ఉన్న సినీ
గ్లామర్ ఇమేజ్ ద్వారా చిరంజీవి
అధిష్టానం వద్ద మంచి పేరు
సంపాదించుకున్నారు.
ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీని నేరుగా కలిసే స్థాయికి స్పీడ్గా ఎదిగారు. ఇలాగే
అయితే భవిష్యత్తులో తనకు చిరు వల్ల
రాజకీయంగా ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు. నిన్నటి వరకు బొత్స సత్యనారాయణ
ఒక్కరే కిరణ్కు పార్టీలో
ప్రత్యర్థిగా ఉన్నారు. పిఆర్పీ విలీనంతో చిరంజీవి కూడా తయారయ్యారు. దీంతో
ఆయన చిరును ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చుకునే
ప్రయత్నాలు చేశారు. చిరు కూడా బొత్సతో,
కిరణ్తో మంచిగా ఉంటూనే
పార్టీలో తన పరపతి పెంచుకుంటున్నారు.
ఇలాగే
ఉంటే భవిష్యత్తులో చిరంజీవి తనకు ధీటైన అభ్యర్థి
అవుతాడని కిరణ్ భావిస్తున్నారని అంటున్నారు.
దీంతో చిరును అడ్డుకునేందుకు ఆయన అంటేనే మండిపడే
జీవిత రాజశేఖర్ దంపతులను పార్టీలోకి ఆహ్వానించి ఉంటారని అంటున్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి రాజశేఖర్ దంపతులతో ఫోన్లో మాట్లాడినట్లు
సమాచారం. గతంలో దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెసులో చేరారు.
ఇప్పుడు కిరణ్ సమక్షంలో వారు
పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే
వారు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తాము కాంగ్రెసు పార్టీలోనే
కొనసాగుతామని, ఉప ఎన్నికల ప్రచారంలో
ఆ పార్టీ తరఫున పాల్గొంటామని చెప్పారు.
అయితే వారిని సుబ్బిరామి రెడ్డి కాంగ్రెసులోకి ఆహ్వానించి, ఆ విషయం సిఎంకు
చెప్పారట. వెంటనే సిఎం వారిద్దరితో మాట్లాడారట.
కిరణ్కు, బొత్సకు మధ్య
నెలకొన్న వ్యక్తిగత వివాదం నేపథ్యంలో అధిష్టానం చిరును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే
సమన్వయ కమిటీలో స్థానం, రాజ్యసభ పదవి ఇచ్చింది. త్వరలో
మంత్రి పదవి కూడా ఇవ్వనుంది.
ప్రచార బాధ్యతలను చిరంజీవికి ప్రధానంగా అప్పగించింది. ఇలాంటి సమయంలో పార్టీలో చిరు స్టార్ కంపెయినర్గా ఎదిగితే మొదటికే
మోసం వస్తుందని కూడా కిరణ్, ఆయన
వర్గం గ్రహించిందట. దీంతో పార్టీలో చిరు
ప్రభావం కాస్త తగ్గించాలంటే అదే
సినీ గ్లామర్ టచ్ ఇస్తే బావుంటుందనే
రాజశేఖర్ దంపతులను తీసుకు వస్తున్నారని అంటున్నారు.
చిరంజీవికి
పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్నందున జీవితకు పార్టీ మహళా అధ్యక్ష పదవి
ఇచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ మేరకు కిరణ్
వారికి హామీ ఇచ్చి పార్టీలోకి
తీసుకు వచ్చారని అంటున్నారు. ఇందుకోసం కిరణ్ వారిని సోనియా
గాంధీ వద్దకు త్వరలో తీసుకు వెళ్లనున్నారని అంటున్నారు. గతంలో జీవితకు ఓసారి
మహిళా కాంగ్రెసు అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి
జారీ పోయింది.







0 comments:
Post a Comment