అనంతపురం/విజయవాడ: తాను పార్టీని వీడేది
లేదని తెలుగుదేశం పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ చెబుతున్నప్పటికీ పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
సులభంగా వదిలేట్లు లేరు. తాను పార్టీని
వీడేది లేదని వంశీ బుధవారం
మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
తాను కలవడంపై దుమారం రేగిన నేపథ్యంలో ఆయన
గన్నవరంలో మీడియాతో మాట్లాడారు. జగన్ను తాను
మర్యాదవూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు. జగన్తో భేటీపై దురుద్దేశాలు
ఆపాదించవద్దని ఆయన కోరారు.
జగన్తో భేటీ వ్యవహారం
ఇంత వివాదం అవుతుందని తాను అనుకోలేదని ఆయన
అన్నారు. తనకు ఏ విధమైన
రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం
చేశారు. జగన్ను కలిసిన
అంశంపై పార్టీ జారీ చేసిన షోకాజ్
నోటీసుపై తాను పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడిని కలిసి వివరణ ఇస్తానని
ఆయన చెప్పారు. తాను పరిటాల రవి
అనుచరుడిని అయినందుకు గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు.
అయితే,
వంశీ వ్యవహారాన్ని అంత సులభంగా వదిలేయడానికి
పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. షోకాజ్ నోటీసుకు
వివరణ ఇచ్చిన తర్వాతనే వంశీ చంద్రబాబును కలవాలని
పార్టీ సీనియర్ నేతలు అన్నట్లు తెలిసిందే.
పార్టీ సీనియర్ నాయకులతో వంశీ వ్యవహారంపై మాట్లాడినట్లు
సమాచారం. వంశీ వ్యవహార శైలి
అభ్యంతరకరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు
పరిటాల రవి హత్యలో వైయస్
జగన్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు
లేవని వంశీ చేసిన ప్రకటనపై
కూడా పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు
తెలుస్తోంది.
వల్లభనేని
వంశీని పార్టీ నుంచి పంపించాల్సిందేనని నందమూరి
హీరో బాలకృష్ణ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. వంశీ వివరణ ఇచ్చినా
పార్టీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి లేదని
అంటున్నారు. వంశీ ఏదో రకంగా
పార్టీ నుంచి వెళ్లిపోయి, వైయస్సార్
కాంగ్రెసులో చేరాలనే ఉద్దేశంతోనే ఉన్నారనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అందువల్ల
వంశీని అనుగ్రహించకూడదని తెలుగుదేశం నాయకులు పట్టుబడుతున్నారు.
0 comments:
Post a Comment