హైదరాబాద్:
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
సిబిఐ అరెస్టు చేసింది. ఆదివారం సాయంత్రం ఆయనను అరెస్టు చేసినట్లు
సిబిఐ ప్రకటించింది. గత మూడు రోజులుగా
వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు.
సోమవారం ఆయనను సిబిఐ కోర్టులో
ప్రవేశపెట్టనుంది. ఈ నెల 28వ
తేదీన తమ ముందు హాజరు
కావాలని కోర్టు ఇదివరకే జగన్కు సమన్లు
జారీ చేసింది. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల
నుంచి ఆయనను సిబిఐ అధికారులు
విచారించారు. సిబిఐ అధికారులు ఆదివారం
సాయంత్రం దిల్కుషాలో వైద్య
పరీక్షలు నిర్వహించారు. జగన్ను సిబిఐ
ఎంతకు వదిలిపెట్టకపోవడంతో జగన్ తల్లి విజయమ్మ,
భార్య భారతి, సోదరి షర్మిళ, ఇతర
కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి ఎంవి
మైసురా రెడ్డి దిల్కుషా అతిథి
గృహానికి చేరుకున్నారు. నాలుగు కార్లలో వారు ఇక్కడికి వచ్చారు.
శుక్రవారం,
శనివారం విచారించి జగన్ను సాయంత్రం
ఆరున్నర గంటల లోపే సిబిఐ
అధికారులు వదిలేశారు. ఆదివారం ఆరున్నర తర్వాత కూడా వదిలేయకపోవడం అనుమానాలు
పెరిగాయి. దిల్కుషాకు పబ్లిక్
ప్రాసిక్యూటర్ చేరుకున్నారు. సిబిఐ తరఫు న్యాయవాది
కూడా దిల్కుషా అతిథి
గృహానికి చేరుకున్నారు. ఇక్కడే శుక్రవారం నుంచి సిబిఐ అధికారులు
జగన్ను విచారిస్తున్నారు. ర్యాపిడ్
యాక్షన్ ఫోర్స్ను కూడా పలు
ప్రాంతాల్లో రంగంలోకి దింపారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో
అడ్వొకేట్ జనరల్ ఆదివారం సాయంత్రం
సమావేశమయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు కాస్తా
ముందు సిబిఐ జెడి లక్ష్మినారాయణ
దిల్కుషా నుంచి బయటకు
వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ
అధికారులతో తాజ్ కృష్ణా హోటల్లో ఆయన మంతనాలు
జరిపారు.
రాష్ట్రవ్యాప్తంగా
పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 144వ
సెక్షన్ విధించారు. హైదరాబాదులోని పలు మార్గాల్లో ట్రాఫిక్
ఆంక్షలు విధించారు. జిల్లాల నుంచి హైదరాబాదుకు వచ్చే
బస్సులను ఆపేశారు. జాతీయ రహదారులపై భద్రతను
కట్టుదిట్టం చేసారు. హైదరాబాదులో పోలీసులకు సెలవులు రద్దు చేశారు. రాజమండ్రిలో
భద్రతను కట్టుదిట్టం చేశారు. కడప జిల్లాలో పెద్ద
యెత్తున పోలీసులను మోహరించారు. పులివెందుల, మైదుకూరు, బద్వేలు ప్రాంతాల్లో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు మోహరించారు.
ముందస్తుగా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద, లోటస్పాండ్లోని జగన్ నివాసం
వద్ద పోలీసుల మోహరింపు పెరిగింది. విజయవాడు నుంచి గుంటూరు, హైదరాబాద్
వెళ్లే బస్సులను రద్దు చేశారు. జగన్
అరెస్టుకు సంబంధించి ఢిల్లీ నుంచి ప్రకటన రావచ్చునని
తొలుత భావించారు. న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా భద్రతను
పెంచారు. ఆర్టీసి బస్సులను డిపోలకు తరలించారు. కడప జిల్లా నుంచి
ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపేశారు. రాజమండ్రిలో బస్సుపై దాడికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తెలుగుదేశం
పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనం వద్ద భద్రతను
పెంచారు. కాకినాడలో 30 మంది వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. హైదరాబాదులోని రాజభవన్ రోడ్డులో భారీగా పోలీసులను మోహరించారు. వైయస్ జగన్ వర్గానికి
చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ కొండా మురళిని హన్మకొండలో
అరెస్టు చేశారు. హైదరాబాదులోని సున్నితమైన ప్రాంతాల్లో పికెటింగులు పెట్టారు. పాలకొల్లులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టారు
0 comments:
Post a Comment