గుంటూరు:
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి
లక్ష్మీ పార్వతి ఆదివారం అన్నారు. ఆమె ఉదయం గుంటూరు
జిల్లాలోని కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం
ఆమె విలేకరులతో మాట్లాడారు.
తెలుగుదేశం
పార్టీ త్వరలో కనుమరుగు కావడం ఖాయమన్నారు. చంద్రబాబును
రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని బాగా ఆదరిస్తున్నారని చెప్పారు.
జగన్ తనకు పెద్ద కుమారుడి
లాంటి వాడన్నారు. తల్లిలా ఆయనకు తాను వెన్నంటి
ఉంటానని చెప్పారు.
కాగా
లక్ష్మీ పార్వతి వైయస్ జగన్ స్థాపించిన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఆమె
పలుమార్లు చంద్రబాబు నాయుడుపై నిప్పులు గక్కారు. చంద్రబాబుతో కలిసి వెళుతున్న రాజ్యసభ
సభ్యుడు హరికృష్ణ, నందమూరి హీరోలు బాలకృష్ణలు, జూనియర్ ఎన్టీఆర్లకు కూడా ఆయనతో
కలిసి వెళ్లవద్దని పలుమార్లు సూచించారు.
గత పలు ఎన్నికలలో చంద్రబాబును
దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ టిడిపి తరఫున అభ్యర్థులను నిలబెట్టింది.
అయితే టిడిపితో ఢీకొనలేక పోయింది. దీంతో ఆమె తాజాగా
జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించడంతో ఆ పార్టీతో కలిసి
వెళుతోంది. ఆమె తన పార్టీని
వైయస్సార్ కాంగ్రెసులో కలపకపోయనప్పటికీ జగన్కు పూర్తిగా
మద్దతు ఇస్తోంది.







0 comments:
Post a Comment