రాజమండ్రి:
కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయవద్దని,
ప్రమాదానికి గురయ్యే రెండు రోజుల ముందు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ముందు తమతో చెప్పారని ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి
జిల్లాలోని రామచంద్రాపురం ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. తాను పార్టీ విషయంలో
కొన్నిసార్లు తప్పు చేశానని వైయస్
ఓసారి చెప్పారని, కానీ ఎవరూ కూడా
జీవితంలో అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారన్నారు.
ఆ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు.
కానీ జగన్ మాత్రం తండ్రి
మాటలు బేఖాతరు చేస్తూ కాంగ్రెసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైయస్ మాటలను అతను
ఎందుకు విస్మరించాడో తనకు అర్థం కావడం
లేదన్నారు. మహిళలకు అండగా ఉండే పార్టీ
కాంగ్రెసు పార్టీయే అన్నారు. 2014లో ఏఐసిసి ప్రధాన
కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు
పిలుపునిచ్చారు.
రామచంద్రాపురం
అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించుకోవాల్సిన
ఆవశ్యకతను ఆయన చెప్పారు. జగన్
పార్టీ నేతలు ఎందుకు రాజీనామా
చేశారో, ఎందుకు పోటీ చేస్తున్నారో అర్థం
కావడం లేదన్నారు. త్రిమూర్తులను ఎమ్మెల్యేగా చేసేందుకే వారు రాజీనామా చేసి
ఉంటారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలు అయిపోయినట్లుగా కనిపిస్తోందన్నారు. అయితే ఇంతటితో సంతోషించకుండా
అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.
దివంగత
వైయస్కు భిన్నంగా జగన్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో
కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కుయుక్తులు
పన్నారన్నారు. టిడిపి అవిశ్వాసానికి జగన్ మద్దతిచ్చినందు వల్లే
ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలనుకున్నారో చెప్పాలని జగన్ను కిరణ్
ప్రశ్నించారు.
ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో అధిష్టానం
నిర్ణయం చేసిన వారే ముఖ్యమంత్రిగా
ఉంటారన్నారు. వైయస్ కూడా అలాగే
అయ్యారన్నారు. జగన్ డెబ్బై గదుల
ఇళ్లు కట్టుకున్నారని, ప్రజా నాయకుడికి ముఖ్యంగా
సిఎం కావాలనుకుంటున్న వ్యక్తి అలాంటి ఇళ్లు కట్టుకొని ప్రజలకు
ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. జగన్ మెంటాలిటీ నాకు
అర్థం కావడం లేదన్నారు. డ్వాక్రా
గ్రూపుల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెసు కృషి చేస్తోందన్నారు. రాజకీయాలను
జగన్ వ్యాపారంగా మార్చుతున్నారని మండిపడ్డారు.







0 comments:
Post a Comment