కడప:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
పథకాలను తన తనయుడు, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారని పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం
అన్నారు. పేద విద్యార్థులందరికీ ఉన్నత
విద్యను అందించాలన్నదే వైయస్ లక్ష్యమని, దానిపై
ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. అతి నిరుపేద కుటుంబాలకు
చెందిన పిల్లలు కూడా ఉన్నత ఉద్యోగాలు
చేయాలని వైయస్ కలలు కన్నారన్నారు.
వారిని
ఆ స్థాయికి తీసుకు వెళ్లేందుకు గ్రామీణ పిల్లల కోసం ట్రిపుల్ ఐటిలు
ఏర్పాటు చేశారన్నారు. వాటిని కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతి గ్రామీణ విద్యార్థికి
కూడా కంప్యూటర్ ఉండాలన్నది వైయస్ కోరిక అన్నారు.
ఇంగ్లీషు భాష ప్రాధాన్యతని గుర్తించి
పాఠశాలలో కూడా చిన్న పిల్లలకు
ఇంగ్లీష్ నేర్పించే ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు పేదలకు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకే వైయస్
రచ్చబండ కార్యక్రమం ప్రవేశ పెట్టారన్నారు.
ఏ పథకం అయినా అందుతుందా
అని అడిగితే ఎవరూ అందడం లేదని
చేతులు ఎత్తకూడదన్నదే వైయస్ ఉద్దేశ్యమన్నారు. వైయస్
పథకాలను ప్రజల నుంచి చెరిపి
వేయాలని ఈ ప్రభుత్వం కుట్ర
చేస్తోందని ఆమె వాపోయారు. ఈ
బడ్జెట్లో ఫీజు రీయింబర్సుమెంట్సుకు
రూ.2,900 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
అందులో రూ.2,600 పాత బకాయిలే అని
తెలిపారు. విడుదల కావాల్సిన నిధులు రూ.3,500 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
వైయస్
పథకాలను జగన్ అధికారంలోకి వస్తే
కొనసాగిస్తారని చెప్పారు. ఇంకా పలు కొత్త
పథకాలు ప్రవేశ పెడతారన్నారు. ఈ సందర్భంగా ఆమె
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లక్ష్యాలను చెప్పారు. కెజి నుంచి పిజి
వరకు పేద విద్యార్థులకు ఉచిత
విద్య ఇస్తామని ఆమె చెప్పారు. పాఠశాలలకు,
కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి నగదు జమ చేస్తామని
హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ వైయస్ఆర్ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.







0 comments:
Post a Comment