హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ఖాతాల స్తంభనపై ప్రస్తుతం
ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) కూడా దృష్టి
సారించినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందే సిబిఐ జగన్ మీడియా
ఖాతాలను స్తంభింప చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అవే ఖాతాల స్తంభనపై
ఈడి కూడా దృష్టి సారించినట్లుగా
సమాచారం.
దీంతో
జగన్ మీడియా ఖాతాలకు మరోసారి తాళం పడే అవకాశాలు
కనిపిస్తున్నాయి. జగతి పబ్లికేషన్స్, ఇందిరా
టెలివిజన్, జనని ఇన్ఫ్రాకు
చెందిన బ్యాంకు ఖాతాల లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆయా
బ్యాంకులకు ఈడి నోటీసులు పంపినట్లు
సమాచారం. గతంలో సిబిఐ స్తంభింపజేసిన
ఖాతాలనే... ఈడి కూడా ఫ్రీజ్
చేయనున్నట్లు సమాచారం. సిఆర్పీసిలోని సెక్షన్ 120 ప్రకారం గత నెల 8వ
తేదీన సిబిఐ జగన్ మీడియా
ఖాతాలను స్తంభింప చేసింది.
వైయస్
జగన్, ఇతరులు ప్రతినిధులుగా ఉన్న జగతి పబ్లికేషన్స్,
ఇందిరా టెలివిజన్, జనని ఇన్ఫ్రా
సంస్థలు మీ బ్యాంకులో ఖాతాలు
నిర్వహిస్తున్నాయని... వివిధ మార్గాల ద్వారా
నేరపూరిత విధానాల్లో అక్రమంగా సమీకరించిన సొమ్మును వ్యాపార నిర్వహణ ముసుగులో ఆ ఖాతాల్లో జమ
చేశాయని తమ దర్యాప్తులో స్పష్టమౌతోందని,
క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 1973లోని 102వ సెక్షన్ ద్వారా
మాకు లభించిన అధికారాల ప్రకారం... పైసంస్థల ఖాతాలను స్తంభింప చేయాలని ఆదేశిస్తున్నామని సిబిఐ అప్పుడు నోటీసులు
ఇచ్చింది.
ఆ ఖాతాలకు సంబంధించి ఇకపై ఎలాంటి లావాదేవీలు
జరగకూడదని, అలాగే... ఏయే ఖాతాను ఎంత
మొత్తంతో స్తంభింపచేశారో వెంటనే మాకు తెలియజేయగలరని ఎస్బిఐ, ఓబిసి శాఖలకు
అప్పట్లో సిబిఐ ఎస్పీ వెంకటేశ్
నోటీసులు ఇచ్చారు. అయితే... ఖాతాల స్తంభన వల్ల
ఉద్యోగుల వేతనాలకు ఇబ్బంది కలుగుతుందంటూ జగన్ మీడియా హైకోర్టును
ఆశ్రయించింది. దీంతో... కొన్ని షరతులకు లోబడి లావాదేవీల నిర్వహణకు
గతనెల 23న హైకోర్టు అనుమతించింది.
లావాదేవీలను
చెక్కుల ద్వారానే నిర్వహించాలని, ఫిక్స్డ్ డిపాజిట్లలోని మొత్తాన్ని
కదిలించరాదని ఆదేశించింది. లావాదేవీల వివరాలను ప్రతినెలా కోర్టుకు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.
మొత్తానికి... హైకోర్టు ఆదేశాలతో జగన్ మీడియాకు ఉపశమనం
లభించింది. ఇప్పుడు... ఈడి రంగంలోకి దిగడంతో
పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
సిబిఐ గతంలో ఏయే ఖాతాలను
ఫ్రీజ్ చేసిందో... అవే అకౌంట్లకు ఈడి
కూడా తాళం వేయించనున్నట్లు సమాచారం.
సిబిఐ చేపట్టిన చర్యలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలులో ఉన్న నేపథ్యంలో... ఇప్పుడు
ఈడి నోటీసులపై ఎలా స్పందించాలనే అంశంపై
బ్యాంకుల్లో అయోమయం మొదలైందని తెలుస్తోంది.
0 comments:
Post a Comment