హైదరాబాద్:
పరకాల ఉప ఎన్నిక ఫలితం
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెంప
పెట్టని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి
దయాకరరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఫోరం
సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో
మాట్లాడారు. పరకాలలో టీఆర్ఎస్ పార్టీ చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచిందని,
తెలంగాణ ప్రజల్లో తెరాసపై నమ్మకం పోతోందని ఆయన అన్నారు. ఆ
పార్టీ తెలంగాణ తేగలదన్న విశ్వాసం సన్నగిల్లడంతో ఉద్యమానికి నష్టం కలిగే సూచనలు
కనిపిస్తున్నాయని, తెలంగాణ సాధన ఉద్యమానికి బిజెపి
నాయకత్వం వహిస్తే మంచిదని తన అభిప్రాయమని ఆయన
అన్నారు.
కేంద్ర
ప్రభుత్వం నాటకాలు మాని తెలంగాణ అంశంపై
స్పష్టతతో ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఒక్కో పార్టీ నుంచి
ఒక్కరినే పిలవాలని, అప్పుడే పరిష్కారం వస్తుందని ఆయన సూచించారు. సీమాంధ్రకు
చెందిన తమ పార్టీ నేతలతో
కూడా మాట్లాడి ఏకాభిప్రాయానికి కృషి చేస్తామని, త్వరలో
జరగనున్న మహానాడు నాటికి ఈ కసరత్తును పూర్తి
చేసి మరింత స్పష్టత ఇస్తామన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలో తమ పార్టీ అధ్యక్షుడి
నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన
తేల్చిచెప్పారు.
పరకాల
ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి
వచ్చిన ఓట్ల శాతంపై ఫోరం
సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ కొంత కృషి
లోపం ఉందని, సమష్టిగా మరి కొంత శ్రమ
పడి ఉంటే మరింత పెద్ద
సంఖ్యలో ఓట్లు సాధించగలిగి ఉండేవారమని
కొందరు నేతలు అన్నారు. తెలంగాణలో
పార్టీ ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి గట్టి ప్రయత్నం చేయాలన్న
అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ
నష్టపోవడంపై చర్చ జరిగింది.
ఇది పార్టీకి గడ్డు కాలమని, పార్టీ
పూర్వ వైభవం సాధించడానికి అధినాయకత్వానికి సహకరించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ
సమావేశంలో ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు,
కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, ఏలేటి
అన్నపూర్ణమ్మ, ఉమా మాధవరెడ్డి, సీతక్క,
సీతా దయాకరరెడ్డి, కొత్తకోట దయాకరరెడ్డి, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, పి.
రాములు, ప్రకాశ్ గౌడ్, జి.నగేష్,
విజయ రమణారావు, గంగుల కమలాకర్, అరిగెల
నర్సారెడ్డి, గంగాధర్ గౌడ్, సంకినేని వెంకటేశ్వరరావు,
చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment