హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ను రాజకీయాల్లోకి రమ్మనడం
వెనుక వారికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై
విశ్వాసం సడలడమా మరేదైనా కారణం ఉందా అనే
చర్చ రాజకీయా వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల పలువురు దేశం
నేతలు నారా లోకేష్ను
రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. బాబుపై విశ్వాసం సడలడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే పార్టీకి ఓ యువనేత కావాలని
తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి
కాలంలో రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర
పోషిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని యంగ్ తరంగ్
కూడా వీటి పైన ప్రధానంగా
దృష్టి సారిస్తోంది. వీరంతా పాత తరం రాజకీయ
నాయకుల కంటే కొత్త తరంపై
ఆసక్తి కనబరుస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఇటీవలి కాలంలో
యువత మొగ్గు చూపడమే అందుకు మంచి నిదర్శనం అని
చెబుతున్నారు. యువత.. రాజకీయాలు ఎప్పుడో అవినీతిమయమై పోయాయని భావిస్తుందని, అందుకే ఆ అంశానికి పెద్దగా
ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారని అంటున్నారు.
జగన్
లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రచారం చేసినప్పటికీ ఆ అంశం ఇటీవల
జరిగిన ఉప ఎన్నికలలో ఏమాత్రం
ప్రభావం చూపలేదని చెబుతున్నారు. మధ్యవయస్కులు, వృద్ధులు సానుభూతితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే.. యువత మాత్రం యువనేత
అనే భావనతో జగన్ వైపుకు మొగ్గారని
చెబుతున్నారు. అనుభవజ్ఞులు అయినా, పరిపాలన బాగున్నా.. ఓ తరం అయిపోయిన
నేతలను యువత పట్టించుకోవడం లేదని
అంటున్నారు. యువ నాయకుల వైపే
వారు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే
యువకుడైన నారా లోకేష్ను
రాజకీయాల్లోకి తీసుకు వస్తే పార్టీకి చాలా
ప్లస్ అవుతుందని భావిస్తుండవచ్చునని అంటున్నారు. మరోవైపు టిడిపిలో చంద్రబాబు మినహా ప్రత్యామ్నాయ నేత
లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. బాలయ్య వంటి వారు ఉన్నప్పటికీ
సినిమాలలో బిజీగా ఉన్నందున పార్టీలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం
లేదని అంటున్నారు. బాబు తర్వాత ఓ
ప్రత్యామ్నాయం కావాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారని అంటున్నారు.
జూనియర్
ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఆయన మద్దతు నిలకడగా
లేదని చెబుతున్నారు. నందమూరి - నారా కుటుంబాల మధ్య
ఉన్న విభేదాల కారణంగా కూడా జూనియర్ పేరును
తెర పైకి తీసుకు వచ్చేందుకు
తమ్ముళ్లు ధైర్యం చేయడం లేదనే వ్యాఖ్యలు
వినిపిస్తున్నాయి. దీంతో తరుచూ లోకేష్
పేరు ప్రస్తావనకొస్తుందని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్
చేసిన వ్యాఖ్యలు తదితర పరిణామాల నేపథ్యంలో
లోకేష్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
0 comments:
Post a Comment