ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో మళ్లీ వారసత్వ రాజకీయాల
చర్చ ముందుకు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పుంజుకోవాల్సిన తెలుగుదేశం
పార్టీ ఉప ఎన్నికల్లో తగిన
ఫలితాలు సాధించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో పార్టీకి
కొత్త రక్తం కావాలనే అభిప్రాయం
కూడా ముందుకు వస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి
తనయుడు నారా లోకేష్, రాజ్యసభ
సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య వారసత్వ పోరు
అంశం మళ్లీ చర్చకు వచ్చింది.
నారా
లోకేష్ రాజకీయాల్లోకి రావాలని, లోకేష్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నామని
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం
మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన వర్ల రామయ్య ఆ
వ్యాఖ్య చేయడాన్ని బట్టి నారా లోకేష్
పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు అనుమానిస్తున్నారు.
ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు దానికి సంబంధించిన
అంశాన్ని బయటకు వదిలి చర్చ
జరిగేలా చూడడం చంద్రబాబుకు అలవాటు.
తన పద్ధతిలో భాగంగానే నారా లోకేష్ రాజకీయ
రంగ ప్రవేశంపై వర్ల రామయ్యతో చంద్రబాబు
ఆ మాటలు అనిపించారని అంటున్నారు.
ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి జూనియర్
ఎన్టీఆర్ మాస్ అపీలు పనికి
వస్తుందని తెలుగుదేశంలో మరో వర్గం అంటోంది.
నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడతారనే అంశం ముందుకు వచ్చిన
ప్రతిసారీ జూనియర్ ఎన్టీఆర్ అంశం ప్రస్తావనకు వస్తోంది.
నారా
లోకేష్ను పార్టీలోకి తెచ్చి,
కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు గతంలోనే ప్రయత్నాలు చేశారని అంటారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి
నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసమ్మతి సెగను ఎగదోసినట్లు అప్పట్లో
ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో
నారా లోకేష్ రాజకీయ ప్రవేశాన్ని చంద్రబాబు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెబుతారు. నారా లోకేష్కు
నందమూరి హీరో, మామ బాలకృష్ణ
మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment