హైదరాబాద్/వరంగల్/కరీంనగర్: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్పై తెలంగాణ నాయకులు
దాడిని ఉధృతం చేశారు. తెలంగాణ
రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు రాజగోపాల్పై ఆదివారం తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ నాశనమైనా పర్వాలేదు.. రాష్ట్రం మాత్రం సమైక్యంగా ఉండాలి' అని లగడపాటి రాజగోపాల్
కుట్రపన్నారని కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆయనకు లైసెన్సు ఎవరిచ్చారని
ప్రశ్నించారు.
లగడపాటిని
కట్టడి చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కోరారు.
తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే నైతికహక్కు రాజగోపాల్కు లేదన్నారు. సీమాంధ్రలో
పార్టీని రక్షించే ఆలోచన చేయాలంటూ హితవు
పలికారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే వేర్పాటువాదం బలపడుతుందని సీమాంధ్రలో రాజగోపాల్ ప్రచారం చేశారని, అక్కడ అదే పార్టీ
గెలిచినందున అక్కడి ప్రజలు తెలంగాణ ఇవ్వాలని కోరుకుంటున్నారని కాంగ్రెసు మరో పార్లమెంటు సభ్యుడు
సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. అసలు లగడపాటి పార్టీలో
ఏ హోదాలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉత్తర ప్రగల్భాలు పలకొద్దని
హితవు పలికారు.
జగన్కు ఓటు వేస్తే
రాష్ట్ర విభజనకు ఓటు వేసినట్టేనని రాజగోపాల్,
ఇతర కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశారని, అంటే సీమాంధ్ర ప్రజలు
కూడా రాష్ట్ర విభజనను కోరుకుంటున్నట్టు ఈ ఎన్నికల ద్వారా
రుజువైందని పెద్దపల్లి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు.
ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ గురించి మాట్లాడవద్దని ఆయన సూచించారు. చిలక
జోస్యాలు మానుకుని తెలంగాణ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని లగడపాటిపై కాంగ్రెస్ తెలంగాణ సారథ్య బృందం నేత నిరంజన్
ధ్వజమెత్తారు.
పరకాలలో
అభ్యర్థులంతా తెలంగాణవాదులేనని, వైఎస్ విజయలక్ష్మి సైతం తెలంగాణ ప్రజల
అభిప్రాయాన్ని గౌరవిస్తామన్నారని గుర్తుచేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్కు నష్టం చేసిన
లగడపాటి తెలంగాణలోనూ పార్టీని భూస్థాపితం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్కు ఓట్లేస్తే
రాష్ట్రం రెండు ముక్కలవుతుందంటూ మాట్లాడి
కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితిని లగడపాటి రాజగోపాల్ తెచ్చారని మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆరోపించారు. లగడపాటి వంటివారి వ్యాఖ్యలతో కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ స్పష్టత ఇవ్వలేకపోయిందని,
ఆ ప్రభావం పరకాల ఎన్నికలపై చూపిందని
ఆయన అన్నారు.
వాస్తవాల
వక్రీకరణలో రాజగోపాల్ మొనగాడని తెరాస మాజీ ఎంపీ
వినోద్కుమార్ ఎద్దేవాచేశారు. పరకాల ఉప ఎన్నికల్లో
తెరాసకు అనుకూలంగా 33%, వ్యతిరేకంగా 67% ఓట్లు పడ్డాయంటూ ఇక
తెలంగాణ ఏం ఇస్తారని లగడపాటి
వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. పరకాలలో
తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా
పడలేదన్నారు. కొండా సురేఖకు వ్యక్తిగతంగా
ఉన్న పేరు, ఆమె భర్త
ధనప్రవాహం, ఆయనంటే ఉన్న భయం వల్లనే
జగన్ పార్టీకి అన్ని ఓట్లు వచ్చాయని
వినోద్ అన్నారు.
0 comments:
Post a Comment